ఆ విషయం కేసీఆరే చెప్పారు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే వచ్చిందని కేసీఆరే చెప్పారని శాసనమండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు..

Update: 2025-03-21 16:29 GMT
ఆ విషయం కేసీఆరే చెప్పారు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ రాష్ట్ర సాధనపై కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సొనియా గాందీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పారు’ అని జీవన్ రెడ్డి వెల్లడించారు. బడ్జెట్ పై చర్చ సందర్బంగా శాసనమండలిలో శుక్రవారం మాట్లాడారు. 1956 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రూ.60వేల కోట్ల అప్పులుంటే పదేండ్ల కాలంలో రూ.6లక్షలు అప్పులు చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి తమ ప్రభుత్వం అప్పులు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు రూ.1.57లక్షల కోట్లు అయితే దీనిలో గతప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీ కలిపి చెల్లించడానికి రూ.1,09,812కోట్లు ఖర్చుచేసినట్టు వివరించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్నీ నిలిపేయలేదని తెలిపారు. గతంలో గుట్టలు, కొండలు, సాగుయోగ్యంకాని భూములకు రైతు బంధు ఇచ్చారని, వాటన్నింటి ప్రభుత్వం బంద్ చేసి సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టలేదని, తమ ప్రభుత్వం ఈప్రాజెక్టు నిర్మించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తరలిస్తామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా ఆడబిడ్డల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు.  తమ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తుందని చెప్పారు. భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేపట్టి మధ్యలోనే వదిలేసిన ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంలో తమ భాగస్వామ్యం ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 


Similar News