బీఆర్​ఎస్​ వాకౌట్​ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు : మంత్రి తుమ్మల

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకున్న రైతులకు ఇచ్చిన హామీ మేరకు, దేశ చరిత్రలో ఎవరూ చేయనివి సాహసోపేత నిర్ణయం తీసుకొని, ఏకకాలంలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

Update: 2025-03-23 16:34 GMT
బీఆర్​ఎస్​ వాకౌట్​ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు : మంత్రి తుమ్మల
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకున్న రైతులకు ఇచ్చిన హామీ మేరకు, దేశ చరిత్రలో ఎవరూ చేయనివి సాహసోపేత నిర్ణయం తీసుకొని, ఏకకాలంలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. బీఆర్ఎస్​నేతలు ప్రభుత్వం రుణమాఫీ చేయలేదనే విమర్శలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.20,616.89 కోట్లు రుణమాఫీ చేసి, 25,35,964 మంది రైతులను రుణ విముక్తులని చేసి, రైతుల పట్ల మా నిబద్ధతను చాటుకున్నామని తెలిపారు.

మొదటి మూడు విడతలలో రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులను ఈ పథకం కిందకి తీసుకొచ్చే విధంగా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి, మూడు నెలల పాటు అధికారులు ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించి, చివరి విడతలో 3,13,896 మంది రైతులకు రూ. 2747.67 కోట్లు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. 2014 రుణమాఫీ లో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, నాలుగు సంవత్సరాల సమయం తీసుకుని విడతల వారిగా జమ చేయడంతో రైతులపై రూ. 2630 కోట్లు అధిక వడ్డీ భారం పడిందన్నారు. గత ప్రభుత్వం 2014, 2018 లో రుణమాఫీ అమలు చేసిన విధానం ఏ విధంగా చేయకూడదో తెలియజేస్తే, మా ప్రభుత్వం 2024 లో రుణమాఫీ పథకం అమలు చేసిన తీరు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఒక దిక్సూచిగా నిలిచిందన్నారు.

పథకాన్ని అమలు చేయలేక రెండు పర్యాయాలు చేతులెత్తేసిన బీఆర్​ఎస్​, రేవంత్​సర్కార్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రైతుబంధు పేరిట అన్ని పథకాలకు తిలోధకాలు ఇచ్చి మాకు నీతులు చెప్పడం హాస్యస్పదంగా ఉందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలుతో పాటు సన్న వడ్లకు బోనస్, వ్యవసాయ యాంత్రీకరణ, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. పంట నష్ట పరిహారం ఎగ్గొట్టి, రైతుల ఉసురు పోసుకున్న గత పాలకులు వచ్చిన మొదటి సంవత్సరంలో ఏ ఒక్క రైతు ప్రకృతి వైపరిత్యంతో నష్టపోవద్దని ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందించామన్నారు.

పంటల భీమా పథకం నుండి తప్పుకొని రైతులను మోసం చేసిందని, తాము ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం ఈ సంవత్సరం తిరిగి పునరుద్ధరిస్తు, రైతుల ప్రీమియంలో సింహభాగం చెల్లిస్తామని చెప్పారు. వరి వేస్తే ఉరి, మొక్కజొన్న వద్దు, పత్తి సాగు వద్దని, సన్నాలు సాగు చేయమని సీజన్​కో మాట చెప్పి, తీరా పంటలు చేతికొచ్చాక, రైతులను పట్టించుకోకుండా వదిలేసిన ఘనత బీఆర్​ఎస్​పాలకులదేనన్నారు. ఈ విధంగానే భవిష్యత్తులో కూడా ఇష్టారీతిన మాట్లాడితే, వాకౌట్ చేయడం కాదు, ప్రజాక్షేత్రం నుండి ప్రజలే తరిమికొడుతారని హెచ్చరించారు. భవిష్యత్ కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ పురోగతికి కావాల్సిన చర్యలు తీసుకొని రైతుల అభివృద్దికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Similar News