బిల్లు కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవద్దు : ఎంపీ ఆర్ కృష్ణయ్య
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లు చట్టం చేసి, వెంటనే ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లు చట్టం చేసి, వెంటనే ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య కోరారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవద్దని, బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలన్నారు. అక్కడ రిజర్వేషన్లు పెంచినప్పుడు బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు మొదట జీవోలు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేశారు. తరువాత కొందరు న్యాయ స్ధానానికి వెళ్లితే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసిందన్నారు.
ఈ ధపా సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్ళినా బీసీల కేసు గెలుస్తుందని, జనాభా లెక్కలు ఉండంతో పాటు అసెంబ్లీ చట్టం చేసిందన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూ ఎఓ కేసులో 50 శాతం సీలింగ్ ఎత్తివేసిందని, ఇప్పుడు అన్ని కోణాల్లో చూస్తే కేసు గెలుస్తుందని చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవన్నారు. ఆదివారం బీసీ భవన్లో 26 బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రసంగిస్తూ జయలలిత గతంలో తమిళనాడు బీసీల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బిల్లు పాస్ అయ్యేంతవరకు అక్కడే ఉన్నారని గుర్తు చేశారు. ఇటీవల బీహార్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన ప్రభుత్వం జీవో జారీ చేసి ఉద్యోగాలు కూడా భర్తీ చేశారు.
ఆ తరువాత కోర్టులో కేసు వేశారని, ఇక్కడ కూడా మొదట న్యాయ నిపుణులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. ఈ ప్రక్రియ అంత పాటించి కూడా కేంద్రం మీద నెట్టి చేతులు దులుపు కోకుండా మొత్తం ప్రణాళిక పాటించాలని కోరారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ విద్యార్ధులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యుస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 29 శాతం నుంచి 42 శాతంకు పెంచుతూ రెండు బిల్లులు పాస్ చేయడం చారిత్రాత్మకమని, అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మణికంఠ, రాజు నేత, నీల వెంకటేష్, నరేశ్ ముదిరాజ్, స్వామి గౌడ్, రవీందర్ యాదవ్, కుమార్ యాదవ్, మల్లేశం, బాలయ్య, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.