తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన అప్పుడే.. MP క్లారిటీ
కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)లపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)లపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రెండూ కుటుంబ, అవినీతి పార్టీలే అని విమర్శించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే.. ఆయా స్థానాల్లో బీజేపీదే విజయం అని జోస్యం చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో బీజేపీ గెలుపులను ఎవరూ ఆపలేరు అని కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. బీసీల్లో ముస్లింలను చేర్చడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఏప్రిల్‌లోగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేక విపక్ష నేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ పరిపాలనలో అవగాహన లేదని అన్నారు. ఆర్బీఐ నుంచి అప్పులు వస్తేగాని రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు.
ఇదిలా ఉండగా.. పార్టీలో కొత్త-పాత, బీసీ-ఓసీ ఈక్వేషన్స్మధ్య అధ్యక్షుడి పోటీ నడుస్తోందని పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా రెడ్డి ఉన్నందున ఆ వర్గానికి ఎంత వరకు అధ్యక్ష పదవి ఇస్తారనే సందేహాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం, మిగిలిన వర్గాలకు కూడా న్యాయం చేయడం అవసరమని ఉద్దేశంతో బీసీలకు ఇవ్వవచ్చని విశ్లేషిస్తున్నారు. కీలకమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారని ఆ పార్టీ కేడర్‌తో పాటుగా నాయకులు, ఇతర పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.