బీసీలను అవమానించేలా తెలంగాణ బడ్జెట్: ఎమ్మెల్యే శంకర్ ఫైర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలను అవమానపరిచేలా ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలను అవమానపరిచేలా ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన గురువారం మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బడ్జెట్ మాత్రం కేటాయించలేదని ఫైరయ్యారు. రాబోయే రోజుల్లో బీసీలకు చేయబోయే అన్యాయం కాస్త ముందుగానే.. ఈ బడ్జెట్‌తోనే తేలిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను బడ్జెట్‌లో చూపించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష కోట్లకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని శంకర్ ప్రశ్నించారు. అనంతరం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలోనే కాకుండా అధికారికంగా కూడా మోసం చేస్తుందని నిరూపించుకుందని పాయల్ శంకర్ విమర్శలు చేశారు. 63 లక్షల మంది డ్రాక్వా గ్రూప్ మహిళలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకొని తిరిగి చెల్లిస్తారని, వారి అప్పులకు తెలంగాణ బడ్జెట్‌కు సంబంధమేటని ప్రశ్నించారు. తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీలకు రూ.9200 కోట్ల నిధులే కేటాయించడంపై ఆయన విరుచుకుపడ్డారు. రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.26 వేల కోట్లలో కేంద్ర ప్రభుత్వం చేసే సాయం చెప్పడం లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. గృహజ్యోతి పథకం గురించి గొప్పగా చెప్పి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 36 లక్షల ఇండ్లకు మాత్రమే ఇస్తానంటున్నారని ధ్వజమెత్తారు.
ఫసల్ బీమా యోజనలో భాగస్వామ్యమవుతామని చెప్పారని, కానీ తమ వాటా ఎంత ఉంటుందో చెప్పలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్ కేటాయింపులు చేయలేదన్నారు. అప్పు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి, బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అప్పు కాంగ్రెస్ ఐదేళ్ల లోనే చేసేలా ఉందని ధ్వజమెత్తారు. డిక్లరేషన్లపైనా బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని పాయల్ శంకర్ తెలిపారు. రాహుల్, సోనియా గాంధీ ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఎద్దేవాచేశారు. ఈ బడ్జెట్‌పై రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఇదే తరహాలో అహంకార పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు.