Sridhar Babu: అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేకపోయింది
శాసనసభ సమావేశాలు తొమ్మిది రోజుల పాటు విజయవంతంగా జరిగాయని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: శాసనసభ సమావేశాలు తొమ్మిది రోజుల పాటు విజయవంతంగా జరిగాయని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. 38 శాఖల డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించినట్లు వెల్లడించారు. 65 గంటల 33 నిమిషాల పాటు అసెంబ్లీ పనిచేసిందన్నారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఏకంగా 17 గంటలకు పైగా అసెంబ్లీలో జరిగిన చర్చలో 24 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారన్నారు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు పద్దులపై మాట్లాడడానికి స్పీకర్ అవకాశం ఇవ్వడం మంచి సంప్రదాయం అన్నారు. ఎస్సీ రిజర్వేషన్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పుపై అసెంబ్లీలో ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఆమోదించుకున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం చరిత్రలో ఒక గొప్ప అడుగు అని కొనియాడారు. ఐదు ప్రభుత్వ బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిందన్నారు.