భారత రాష్ట్రపతి ముర్ముకి మంత్రి సీతక్క వినతి

ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహించే ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ గా మార్చే చట్టానికి ఆమోదం తెలపాలని భారత రాష్ట్రపతికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విన్నవించారు.

Update: 2024-09-28 16:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహించే ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ గా మార్చే చట్టానికి ఆమోదం తెలపాలని భారత రాష్ట్రపతికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విన్నవించారు. శనివారం రాష్ట్రంలో ముర్ము పర్యటన సందర్భంగా.. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ముతో ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్రపతి కార్యాలయంలో ములుగు మున్సిపాలిటీ బిల్లు పెండింగ్ లో ఉందని సీతక్క, రాష్ట్రపతికి గుర్తు చేసినట్టు తెలిపారు. బిల్లును ఆమోదిస్తే ములుగుకి మున్సిపాలిటీ హోదా దక్కుతుందని వివరించారు. త్వరలో బిల్లు క్లియర్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నప్పటి నుంచి, ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు రాష్ట్రపతి పర్యటన ఆద్యంతం మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో మంత్రి సీతక్క రాష్ట్రపతి వెంటే ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ కార్యక్రమన్ని రాష్ట్రపతి ప్రారంభించగా అదే వేదిక నుంచి మంత్రి సీతక్క ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలతో కళా మహోత్సవ కార్యక్రమం కొనసాగటం పట్ల సీతక్క హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆదివాసి బిడ్డగా ఆదివాసీ గిరిజనుల నృత్యాలు తాను ఎంతగానో ఆస్వాదించానని చెప్పారు. ఎవరు ఏ స్థాయికి ఎదిగినా తమ మూలాలను మరిచిపోవద్దని కోరారు. సంస్కృతి సాంప్రదాయాల వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. దేశంలో ఎన్నో కులాలు, ప్రాంతాలు, జాతులు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశానికి అసలైన బలమని చెప్పారు. హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ పల్లె సంస్కృతి ఉట్టిపడే పెయింటింగ్ ను రాష్ట్రపతికి మంత్రి సీతక్క బహుకరించారు. కాగా, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సహచర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ కూడా రాష్ట్రపతికి విడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.


Similar News