వారి వివరాలు కార్డు వెనకాల ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి సూచన

రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై కసరత్తు వేగవంతమైంది. ఇదే కార్డు అటు రేషను అవసరాలతో పాటు ఆరోగ్యం, సంక్షేమ పథకాలకు కూడా వర్తిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Update: 2024-09-28 17:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై కసరత్తు వేగవంతమైంది. ఇదే కార్డు అటు రేషను అవసరాలతో పాటు ఆరోగ్యం, సంక్షేమ పథకాలకు కూడా వర్తిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ కార్డులపై కుటుంబ యజమానిగా మహిళ పేరునే పెట్టాలనే నిర్ణయం జరిగింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పట్టణ, మరో గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టుగా అక్టోబరు 3 నుంచి కుటుంబాలను నిర్ధారించడానికి ఇంటింటి సర్వే చేసి వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు. పూర్తిగా గ్రామీణ స్వభావంతో కూడిన నియోజకవర్గాల్లో రెండు గ్రామాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో, పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సచివాలయంలో శనివారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై చర్చ సందర్భంగా పలు అంశాలపై నిర్ణయం జరిగింది.

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు (ఎఫ్‌డీసీ)లో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తిస్తున్నందున ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డులో వెనుక భాగంలో ఉండాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఇప్పటికే ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు విధానం రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల్లో అమలవుతున్నందున ఈ నెల 25-27 తేదీల మధ్య అధికారులు చేసిన అధ్య‌య‌నం వివరాలను ఈ సమావేశంలో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా సీఎం, మంత్రులకు వివరించారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేక‌రించిన వివ‌రాలు, కార్డుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు, లోపాల‌ను అధికారులు ప్రస్తావించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్... తెలంగాణలో తీసుకురానున్న ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ రూపకల్పనపై అధికారుల‌కు ప‌లు ఆదేశాలు, సూచ‌న‌లు ఇచ్చారు.

రేష‌న్ కార్డు, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌, ఐటీ, వ్య‌వ‌సాయం, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధార‌ణ చేయాల‌ని సీఎం సూచించారు. ఇత‌ర రాష్ట్రాల కార్డుల రూప‌క‌ల్ప‌న‌, జారీలో ఉన్న మేలైన అంశాల‌ను స్వీక‌రించాల‌ని, లోపాల‌ను పక్కన పెట్టాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అవ‌స‌రంలేని స‌మాచారాన్ని సేక‌రించాల్సిన ప‌ని లేద‌ని నొక్కిచెప్పారు.

నేడు కేబినెట్ సబ్ కమిటీకి ఆఫీసర్ల నివేదిక :

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ కోసం సేకరించాల్సిన స‌మాచారం, ఆ కార్డుల్లో పొందుప‌ర్చాల్సిన వివరాలు, అప్‌డేట్‌కు సంబంధించిన అంశాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ల‌తో కూడిన మంత్రివ‌ర్గ ఉప సంఘానికి అంద‌జేయాల‌ని అధికారులను సీఎం ఈ సమావేశంలో ఆదేశించారు. మంత్రివ‌ర్గ ఉప సంఘం సూచ‌న‌ల మేర‌కు అందులో జ‌త చేయాల్సిన‌, తొల‌గించాల్సిన అంశాల‌పై స‌మ‌గ్ర జాబితా రూపొందించాల‌ని సూచించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని అన్ని శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని, అందులో ఒకటి గ్రామీణ‌ ప్రాంతం మరొకటి ప‌ట్ట‌ణ ప్రాంతంగా ఉండాలన్నారు. పూర్తిగా గ్రామీణ స్వభావంత కూడిన నియోజ‌క‌వ‌ర్గమైతే రెండు గ్రామాలను సెలెక్టు చేసుకోవాలన్నారు. ఒకవేళ పూర్తిగా ప‌ట్ట‌ణ‌ స్వభావంతో ఉన్నట్లయితే రెండు వార్డులు లేదా డివిజ‌న్లను ఎంపిక చేసుకోవాలన్నారు.

కుటుంబాల నిర్ధార‌ణ‌, ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వివ‌రాల‌కు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అక్టోబ‌రు మూడో తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి (డోర్ టూ డోర్‌) ప‌రిశీల‌న చేయించాల‌న్నారు. పైలెట్ ప్రాజెక్టును ప‌క‌డ్బందీగా చేపట్టాల‌ని, ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, ప‌ట్ట‌ణ‌-న‌గ‌ర ప్రాంతాల్లో జోన‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి అధికారిని ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నియ‌మించాల‌ని సూచించారు. ప్ర‌తీ ఉమ్మ‌డి జిల్లాకు ఇటీవ‌ల వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వేసిన సీనియ‌ర్ అధికారుల‌ను ప‌ర్య‌వేక్ష‌కులుగా నియ‌మించాల్సిందిగా ప్ర‌భుత్వ ప్‌లధాన కార్య‌ద‌ర్శిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న స‌మ‌గ్రంగా క‌చ్చిత‌త్వంతో చేప‌ట్టాల‌ని, ఎటువంటి లోపాల‌కు తావులేకుండా చూడాల‌ని నొక్కిచెప్పారు.

ఈ స‌మీక్షా సమావేశంలో మంత్రులు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి శేషాద్రి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శులు అజిత్ రెడ్డి, చంద్‌్శేఖ‌ర్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు సంగీత స‌త్యానారాయ‌ణ‌, మాణిక్‌రాజ్‌, షా న‌వాజ్ ఖాసీం, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీ‌నివాస్‌, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.


Similar News