డయాలసిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్

డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 7 వాస్క్యులర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. వీటి ఎస్టాబ్లిష్​మెంట్ కు ఇప్పటికే అనుమతులు ఇవ్వగా, బడ్జెట్ కూడా సమకూర్చారు.

Update: 2024-09-28 17:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 7 వాస్క్యులర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. వీటి ఎస్టాబ్లిష్​మెంట్ కు ఇప్పటికే అనుమతులు ఇవ్వగా, బడ్జెట్ కూడా సమకూర్చారు. రూ. 33 కోట్ల నిధులతో ఆయా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ లలో హబ్‌లుగా తీర్చిదిద్దుతూ, కొత్తగా వరంగల్ ఎంజీఎం, ఖమ్మం జీజీహెచ్, మహబూబ్ నగర్ జీజీహెచ్, ఆదిలాబాద్ రిమ్స్ లో వాస్క్యులర్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో కిడ్నీ పేషెంట్లకు ఊరట కలగనున్నది. ఈ కేంద్రాలు ఏర్పాటుతో డయాలసిస్ యాక్సెస్ పాయింట్ నిర్ధారణ ఈజీగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు.

ప్రస్తుతం డయాలసిస్ చేయించుకునే పేషెంట్లు ఈ పాయింట్ నిర్ధారించి, ఫిక్స్ చేసేందుకు హైదరాబాద్ వరకు రావాల్సి వస్తుంది. ఇది పేషెంట్లకు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నది. ఆర్థిక భారం రాకుండా, అరోగ్యం మీద కూడా ఒత్తిడి పడే ఛాన్స్ ఉంది. జర్నీ సమయంలో పేషెంట్లు మరింత అనారోగ్య సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ఇదే అంశంపై కొందరు డయాలసిస్ పేషెంట్లు మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత కొత్త వాస్క్యులర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ గత నెలలోనే జీవో కూడా రిలీజ్ చేశారు.

ఈ కేంద్రాలతో ఏమి లాభం..?

రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు తప్పనిసరిగా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ కండిషన్ ను బట్టి కొందరికి వారానికి ఒకసారి, మరి కొందరికి రెండు, మూడు సార్లు కూడా నిర్వహించాల్సి వస్తుంది. అయితే డయాలసిస్ నిర్వహణకు యాక్సెస్ పాయింట్ నిర్ధారించాలి. దీన్ని ఫస్ట్ టైమ్ డయాలసిస్ చేయించుకునే సమయంలో సర్జరీ చేసి ఫిక్స్ చేస్తారు. చేతి మణికట్టు దగ్గర గుర్తించి సెలక్ట్ చేస్తారు. అయితే దీన్ని వాస్క్యులర్ సర్జన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. వీళ్లు రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థల చికిత్సలు చేయడంతో పూర్తి స్థాయిలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీళ్లు మాత్రమే యాక్సెస్ పాయింట్ ను గుర్తించేందుకు సర్జరీ చేస్తారు. ఆ తర్వాత పేషెంట్ డయాలసిస్ చేయడం ఈజీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సర్జరీ కోసం డయాలసిస్ చేయించుకోవాలనుకునే బాధితులంతా హైదరాబాద్ కు వచ్చి మరీ యాక్సెస్ పాయింట్లను ఫిక్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పేషెంట్లు నరకయాతన పడుతున్నారు.

కొత్త కేంద్రాలు వస్తున్నాయ్...?

రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్‌ కోసం ఇప్పటికే 85 కేంద్రాలున్నా, అవి సరిపోవడం లేదు. పేషెంట్ల సంఖ్య భారీగా పెరగడంతో కొన్ని కేంద్రాల్లో సెషన్స్ కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. దీని వలన పేషెంట్ శరీరంలో మలినాలు పేరుకుపోయి, మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో కొత్తగా 18 డయాలసిస్ కేంద్రాలతో పాటు, ఇప్పటికే ఉన్న పాత కేంద్రాల్లో అదనంగా మరో 74 మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంచనా. వీరికి మెరుగైన సేవలు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది.

నియోజకవర్గానికి ఒకటి ఉండేలా ప్లాన్: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ

‘‘డయాలసిస్ పేషెంట్ల బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం మినిమం 30 నుంచి దాదాపు 50 కి.మీలు దాటి వెళ్లి డయాలసిస్ చేపించుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని పేషెంట్లు బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగానే కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. పేషెంట్ల లోడ్ అధికంగా ఉన్న కేంద్రాల్లో మిషన్ల సంఖ్యను పెంచుతున్నాం. దీంతో సెషన్స్ సంఖ్య పెరిగి, పేషెంట్ కు వెయిటింగ్ పీరియడ్ లేకుండా సాధ్యమవుతుంది. లేకుంటే పేదలపై ఆర్థిక భారం పడే ప్రమాదం ఉన్నది. ’’


Similar News