Congress MP: కేసీఆర్ చెప్పి చేయలేనిది.. సీఎం రేవంత్ చేస్తున్నారు

హైడ్రా భావితరాల భవిష్యత్ అని, దానిపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-28 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా భావితరాల భవిష్యత్ అని, దానిపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హైడ్రాను 80 శాతం ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. కొద్ది శాతం మంది కావాలనే కాంట్రవర్సీ చేస్తున్నారన్నారు. పేదలకు న్యాయం జరిగేందుకు ఈ కార్యక్రమం అని క్లారిటీ ఇచ్చారు. దీన్ని సాకుగా చూపించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను బీఆర్ఎస్ దెబ్బతీయాలని చూస్తుందన్నారు. గతంలో కేసీఆర్ చెప్పి చేయలేనిది, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. కానీ హరీష్​రావు, కేటీఆర్‌లు పచ్చి అబద్ధాలు ఆడుతూ, జనాలను డైవర్ట్ చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో 28 వేల అక్రమ కట్టడాలు నాలాలు, చెరువుల మీద ఉన్నాయని, వాటిని కూల్చితే తప్పా, భవిష్యత్‌లో హైదరాబాద్ మనుగడ ఉండదని పేర్కొన్నారు.

ఇందుకు ప్రజలతో పాటు మీడియా సహకరించాలన్నారు. అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో మూసీ ప్రక్షాళన, చెరువులు కుంటలు అక్రమణలను అడ్డుకొని బీఆర్ఎస్, ఇప్పుడు ఎగిరి పడటం విచిత్రంగా ఉన్నదన్నారు. స్వయంగా మాజీ సీఎం అసెంబ్లీలో పర్మిషన్లు లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని, ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారన్నారు. కానీ తమ సీఎం కు ఎన్ని ప్రెజర్లు వచ్చినా, హైడ్రాను ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. హైదరాబాద్ ను మళ్లీ లేక్ సిటీగా మార్చుతామన్నారు. మూసీ ప్రక్షాళన చేసి, పరివాహక ప్రాంతాలను టూరిస్టుప్లేస్ లుగా మార్చుతామన్నారు. అక్కడి పేదలకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.


Similar News