ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి అంబేద్కర్ వర్సిటీ భూములు ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ

జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్స్ట్ యూనివర్సిటీకి అంబేద్కర్ వర్సిటీ భూములు ఇవ్వొద్దని మేధావులు, విద్యావంతులు డిమాండ్ చేశారు.

Update: 2024-09-28 17:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్స్ట్ యూనివర్సిటీకి అంబేద్కర్ వర్సిటీ భూములు ఇవ్వొద్దని మేధావులు, విద్యావంతులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు లేఖ రాశారు. ఇదిలా ఉండగా అంబేద్కర్ వర్సిటీ ప్రాంగణంలో 10 ఎకరాల స్థలాన్ని జేఎన్ఏఎఫ్ ఏయూకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ మేధావులు, విద్యావంతులు 61 మంది సీఎంకు లేఖ రాశారు. తెలంగాణ విద్యావంతుల ఆలోచనలు, విద్యార్థుల ఆకాంక్షలు, ప్రజా ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో విద్యారంగం ఆశించిన ఫలితాలు సాధించలేదని లేఖలో పేర్కొన్నారు. కారణాలు ఏవైనా విద్యావ్యవస్థలో ఎలాంటి పురోగతి లేదని వారు తెలిపారు.

అంబేద్కర్ వర్సిటీ దూరవిద్య విధానం కాబట్టి విద్యార్థులు ఎవరూ ఉండరనే భావన అందరికీ ఉంటుందని, కానీ ఈ వర్సిటీ పూర్తిగా విభిన్నమైందని వారు పేర్కొన్నారు. యూజీ నుంచి పీహెచ్ డీ వరకు ఇక్కడ విద్యా కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. అలాంటి వర్సిటీ భూమిని మరో వర్సిటీకి ఇవ్వడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకత, పేదలకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలను ఇందులో పేర్కొన్నారు. ఉన్నత విద్యావ్యాప్తికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి తదితరాలను లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని పేర్కొన్నారు.


Similar News