సంచార చేప‌ల విక్రయ వాహ‌నాల ప్రారంభించనున్న మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను తీసుకొస్తుంది.

Update: 2025-01-02 11:02 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా మహిళలతో వివిధ వ్యాపారాలు చేయించేలా శిక్షణ ఇప్పిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంచార చేపల విక్రయ వాహనాలను మహిళా సంఘాల కోసం పంచాయతీ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిద్ధం చేసింది. ఈ వాహనాలను రేపు(శుక్రవారం) మంత్రి సీత‌క్క చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. కాగా మొదట జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను ఇవ్వాలని భావించిన ప్రభుత్వం.. ప్రజా భ‌వ‌న్ వేదిక‌గా ఉద‌యం 9.30 గంట‌ల‌కు వాహ‌నాలను తొలి విడ‌త‌లో 25 వాహ‌నాల‌ను ల‌బ్దిదారుల‌కు మంత్రి సీతక్క అంద‌చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. 

జిల్లాకు ఒకటి చొప్పున 32 వాహనాలు

జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను మహిళా సంఘాల కోసం తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ. 10 లక్షల విలువ గల ఈ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం తో అనుసంధానం చేసి.. 60 శాతం సబ్సిడీతో నాలుగు లక్షల రూపాయలకే మహిళా సంఘాలకు కేటాయించనున్నారు. ఈ నాలుగు లక్షల రూపాయలను సైతం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలను ఇప్పించనుంది. ఇప్పటికే, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా బజార్ లను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులను విక్రయించేలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది.


Similar News