Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల అప్డేట్ ఇచ్చిన మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ(Indiramma Indlu) లబ్దిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం ఇందిరమ్మ ఇండ్లు గ్రీవెన్స్ మాడ్యూల్(Grievance Module)ను తీసుకురావడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ(Indiramma Indlu) లబ్దిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం ఇందిరమ్మ ఇండ్లు గ్రీవెన్స్ మాడ్యూల్(Grievance Module)ను తీసుకురావడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. గురువారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్‌కు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఎలాంటి మధ్యవర్తులకు తావులేకుండా అర్హులైన వారికే ఇండ్లు మంజూరయ్యేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వీలైనంత త్వరితగతిన ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో 95 శాతం పూర్తికాగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88 శాతం పూర్తయిందని స్పష్టం చేశారు. త్వరలో లబ్దిదారుల ఎంపిక పూర్తిచేసి ఇండ్ల నిర్మాణానికి చేపట్టవలసిన కార్యాచరణపై దృష్టి సారించాలని.. అలాగే అర్హులైన లబ్దిదారులకు ఇండ్లు అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మొదటి విడతలో నివాసస్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని, రెండో దశలో ప్రభుత్వమే నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మచారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్దిదారులే ఇండ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించామని అన్నారు. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇండ్లు నిర్మించుకోవచ్చని.. చివరి లబ్దిదారుని వరకు ఇండ్ల మంజూరు చేసి నిర్మించే బాధ్యత ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.