‘బాంబులు పేలడం ఖాయం’.. మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ టర్మంతా కొనసాగుతారని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ టర్మంతా కొనసాగుతారని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులు ఆలస్యం అయినా బాంబులు పేలుతాయంటూ ఆయన పునరుద్ఠటించారు. రాబోయే సంక్రాంతి లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని రెండో టర్మ్ అధికారంలోకి తీసుకవచ్చేది ఇందిరమ్మ ఇళ్లేనని తాను పూర్తి విశ్వాసంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లే కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని, ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ లో ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తామన్నారు.
రాబోయే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ళను 28వేల కోట్ల నిర్మించనున్నట్లుగా ఆయన ప్రకటించారు. నిధుల కొరత ఉన్నా... కేంద్రం, రాష్ట్ర నిధులతో పాటుగా రుణాలు తీసుకొని గ్రీన్ ఛానల్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు చెల్లింపులు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. శనివారం సచివాలయంలో తన ఛాంబర్ లో మీడియాతో చీట్ చాట్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 6 తేదీ నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికకు గ్రామ సభలు ప్రారంభమవుతాయని, ఈనెల 20లోగా దాదాపుగా అత్యధిక లబ్ధిదారుల ఎంపిక పూర్తి అవుతుందని ఆయన ప్రకటించారు. మొదటి దశలో ఇళ్ల స్థలాలుున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని, రెండో దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలంతో పాటుగా ఇంటిని మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు.
లబ్దిదారుల ఎంపిక పూర్తిగా గ్రామ సభల ద్వారానే జరుగుతుందని, లబ్ధిదారుల ఎంపిక ప్రాతిపదికకు ప్రత్యేకంగా 360 డిగ్రీస్ తో యాప్ ను రూపొందించామన్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలే ప్రాతిపదికగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపికను స్థానిక తహసిల్దారు లేదా ఎంపీడీవో లేదా మండల స్థాయి అధికారి దృవీకరించాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లో లబ్ధిదారులే ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుందని, పట్టణాల్లో ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ఏజెన్సీలను ఖరారు చేస్తామన్నారు. గ్రామాల్లో ఒక్కొ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని అన్ని సామాజిక వర్గాలకు ఒకే విధంగా చెల్లిస్తామన్నారు. ఈ మొత్తాన్ని నగదు రూపంలో ఇవ్వమని, బ్యాంకు ఖాతాలో వేస్తామని స్పష్టం చేశారు.
తక్కవ ధరకు సిమెంట్ , స్టీల్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇస్తామని పొంగులేటి తెలిపారు. సిమెంట్, స్టీల్ తక్కువ ధరకు అందించేందుకు కంపెనీలతో చర్చలు జరుపుతామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. దేశంలోని ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివరాలు సేకరించి ముందుకు వెళ్తున్నామన్నారు. ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవని, లబ్దిదారుల ఇష్టం మేరకు ఇల్లు నిర్మించుకోవచ్చని, అయితే కనీసం 400 చదరపు అడుగులు తగ్గకుండా లబ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు. అంత కంటే ఎక్కువ సైజులో ఇళ్లు నిర్మించుకున్న అభ్యంతరం లేదని, అంత కంటే తక్కువ మాత్రం ఉండకూడదన్నారు. నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిర్మాణానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. మొదటి లక్ష రూపాయలు, లెంటల్ లెవల్ లో 1.25 లక్షలు, స్లాబ్ దశలో 1.75 లక్షలు, పూర్తి అయ్యాక లక్ష రూపాయలు చెల్లిస్తామన్నారు.
ఈ సంవత్సరం దాదాపుగా ఐదు లక్షల ఇండ్లను చేపడుతామన్నారు. కేంద్రంతో ఎలాంటి భేషజాలకు పోమని, కేంద్ర ఎన్ని నిధులు ఇచ్చినా తీసుకుంటామని, ఇళ్ల ప్రారంభానికి కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులు, ఎంపీలందరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుందని, మొత్తం 28వేల కోట్ల వరకు అవసరం అవుతాయని, ఇందులో కొంత మొత్తం రుణం తీసుకుంటామని, రుణం ఇవ్వడానికి అనేక సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. లబ్ధిదారులకు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 3500 ఇండ్లు నిర్మించేలా చూస్తామని, ఇండ్లలో తప్పనిసరిగా వంటగది, బాత్రూం నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి మండలంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు ఎఈ లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 16 శాఖలకు చెందిన వారిని సమీకరించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు.
దేశంలో తెలంగాణ మాత్రమే ఇంతటి భారీ గృహ నిర్మాణం చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన సుమారు 600 -800 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి సహకరిస్తామన్నారు. సుమారు 7,740 కోట్ల రూపాయిలను ఇందిరమ్మ ఇండ్లకు ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించామని, అవసరమైన నిధుల కోసం కేంద్రాన్ని కోరుతామన్నారు. అర్హులైన వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తే మంచిదేనని అన్నారు. గ్రామ కమిటీలదే తుది ఎంపిక నందనవనం, మంకాల్ ఇండ్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్థలాన్ని సమకూర్చి ఇస్తామన్నారు. ఎక్కడైనా కొత్తగా ఇందిరమ్మ కాలనీలు ఏర్పడితే వాటికి కరెంట్, రోడ్లు , డ్రైనేజ్ తదితర మౌళిక వసతులను ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు.
గత ప్రభుత్వం మూసివేసిన హౌసింగ్ శాఖను పునరుద్దరించామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎలాంటి భేషజాలకు పోవడంలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చిన్నపొరపాటు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యాప్ ద్వారా ఎలాంటి లోపాలు లేకుండా జరుగుతాయని తాము విశ్వసిస్తున్నామని, దీనిని రూపొందించడానికి కొంత సమయం పట్టిందన్నారు.