ఊళ్ళు ఊగుతున్నాయి.. ఇళ్లు పగులుతున్నాయి..!

Update: 2024-10-06 09:02 GMT

దిశ ఆలేరు: ఓ పక్క పచ్చని కొండలు మరోపక్క బంగారం లాంటి పంట పొలాలు ఇవి మొన్నటి వరకు. ఆ గ్రామాలకు సింగారంగా ఉన్న ఆ పచ్చని కొండలు ప్రస్తుతం క్వారీల బ్లాస్టింగ్ పేలుళ్లతో కొండలను పిండి చేసి ఖనిజ సంపదను దోచుకొని వ్యాపారులు కోట్లు దండుకుంటున్నారు.దీంతో గ్రామాల చుట్టూ పచ్చని కొండలతో అలరాడుతున్న ఆ పల్లెలు ప్రస్తుతం అక్రమ క్వారీ మైనింగ్ భారీ బ్లాస్టింగ్ లతో నిలువునా కాలిపోతూ. ఆ గ్రామాల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారిపోతున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలంలోని గ్రామాలపై దిశ ప్రత్యేక కథనం...

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం, భువనగిరి, పోచంపల్లి, వలిగొండ, ఆలేరు, తుర్కపల్లి చౌటుప్పల్, బీబీనగర్, భువనగిరి, మోటకొండూర్, రామన్నపేట, గుండాల,మండలాల్లోమొత్తం 70కి పైగా క్వారీలకు సుమారుగా మొత్తం 300పైగా ఎకరాలకుఉన్న గుట్టలను మైనింగ్ శాఖ అధికారులు ప్రైవేట్ సంస్థలకు ఒక్కొక్క సంస్థకు ఎకరం చొప్పున మొదలుకొని. 16 ఎకరాల వరకు. కనీసం 20 సంవత్సరాలు తగ్గకుండా లీజుకు ఇచ్చింది.

వీటిలో బొమ్మల రామారం మండలంలోని బి. రామామారం, రామ్ లింగంపల్లి, మర్యాల, పెద్ద పర్వతాపూర్, నాగినేనిపల్లి, మైలారం, తిరుమలగిరి, ప్యారారం, తదితర గ్రామాలు నల్ల రాయి ఖనీజ సంపదకు నిలయం. ఈ ప్రాంతాలలో ఈ నల్లరాయి ఖనిజ సంపద ఉండడంతో 150 అడుగుల లోతు మేర భూగర్భంలో రేయింబవళ్ళు అనే తేడా లేకుండా చేస్తున్న భారీ పెలుళ్ల విస్ఫోటనాలు భూ ప్రకంపనలు తలపిస్తూ ఆయా గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీస్,పి సి బి, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా క్వారీ మైనింగ్ వ్యాపారులు రాళ్ళను తొవ్వి తీసేందుకు నిబంధనలు భద్రత పరమైన చర్యలను గాలికి వదిలేస్తూ కొండల్ని తుడిచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల జనవాసాలకు ఈ క్వారీల పేలుళ్లు పెనుముప్పుగా మారాయి.

బ్లాస్టింగ్ లతో ఇళ్లకు బీటలు

క్వారీల యాజమాన్యం వేల పాల లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్న భారీ పేలుళ్ల విస్ఫోటనాలకు గ్రామాల్లోని భూమి కనిపించి ఇళ్లకు బీటలు పడుతున్నాయి. రాత్రి వేళలో నిద్రిస్తున్న చిన్నారులు పేలుళ్ల దాటికి నిద్రలో ఉలిక్కి పడుతున్నారని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ భారీ పేలుళ్ల తో క్వారీలు మా గ్రామాలను కబలిస్తున్నాయని వాపోతున్నారు.

భద్రత ప్రమాణాలు గాలికి..

క్వారీల యాజమాన్యం కనీస భద్రత ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నాయి. క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులకు జాకెట్లు,హెల్మెట్లు వంటి భద్రత ఉపకరణాలు ఇవ్వడం లేదు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం శివారులో హిందుస్థాన్ క్రషర్ క్వారీలో కార్మికులకు ఎలాంటి భద్రత ఉపకరణాలు ఇవ్వకపోవడం మూలంగా రంగారెడ్డి జిల్లా మంచాల కు చెందిన దాసూరి జగన్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఈ క్వారీల లో కార్మికులు నిత్యం ప్రమాదలతో సహవాసం పనిచేస్తున్నారు.

పేలుళ్ల మోతతో గజగజ

బొమ్మల రామారం మండలంలోని సమీప గ్రామాల ప్రజలు పేలుళ్ల మోత తో గజగజ.... , దుమ్ము ధూళితో ...విలవిలలాడుతూ ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవుతున్నారు. అధికారులకు క్వారీలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలను సంఘటితం చేసి పలు ఉద్యమాలు చేసి అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఇక గత్యంతరం లేని పరిస్థితులలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

పట్టించుకోని అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో క్వారీ వ్యాపారులు పరిమితికి మించి అక్రమ పేలుళ్లు చేస్తున్నప్పటికీ. సంస్థలకు కేటాయించిన గుట్టల్లో నె కాకుండా పక్కనున్న గుట్టలను సైతం ఆక్రమించి అక్రమ మైనింగ్ వ్యాపారం చేస్తున్నప్పటికి మైనింగ్, పోలీస్, రెవెన్యూ, పి సి బి, సంబంధిత శాఖల అధికారులు క్వారీ వ్యాపారాలు ఇచ్చే థాయిలాలకు తలోగ్గుతూ పట్టించుకోవడం లేదని ప్రజలు నుంచి అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి. అక్రమ క్వారీ వ్యాపారులపై కోరడ జూలూపించాలాని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

మా ఇంటికు పగుళ్ళు వచ్చాయి : ఊదరి రాణి, పెద్ద పర్వతపూర్

క్వారీ యాజమాన్యం ఒక సమయమంటూ లేకుండా ఇష్టరాజ్యాంగ భారీ పేలుళ్ళు చేయడం మూలంగా భూకంపం వచ్చినట్లుగా భూమి అదురుతూ మా ఇంటికి మొత్తం పగుళ్ళు వచ్చాయి. చంటి పిల్లలు నిద్ర లో వణికి పోతున్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు :సల్ల రవి, రాంలింగం పల్లి

క్వారీలపై అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన మా గోడు పట్టించుకోవడంలేదు. అధికారులు క్వారీ యాజమాన్యం తో కుమ్మకైయారు.మైనింగ్ బ్లాస్టింగ్ లతో మాగ్రామాలు నిలువునా కాలిపోతు. మా గ్రామాల భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారింది.


Similar News