మండుటెండల్లో నిరీక్షణ.. హక్కు పత్రాల కోసం తిప్పలు

దిశ, జవహర్ నగర్: ఇళ్ల క్రమబద్దీకరణ కోసం జీవో 58,59 నిబంధనల ప్రకారం

Update: 2022-03-14 06:14 GMT

దిశ, జవహర్ నగర్: ఇళ్ల క్రమబద్దీకరణ కోసం జీవో 58,59 నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల క్రమబద్దీకరణ కోసం సోమవారం ఈ - సేవ ముందు ప్రజలు బారులు తీశారు.

మండుటెండల్లో నిరీక్షణ

కార్పొరేషన్ పరిధిలో సుమారు రెండు లక్షలకు పైగా జనాభా ఉంది. జవహర్ నగర్ పరిధిలో నివాసం ఉన్న ప్రతి గూడు ప్రభుత్వ భూముల్లో ఉండడంతో చట్టబద్ధత కోసం క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలు తీవ్రస్థాయిలో ఆత్రుత పడుతున్నారు. ఇందుకుగాను పెరుగుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా ఈ - సేవ కేంద్రం ముందు మండుటెండల్లో నిరీక్షణ చేస్తున్నారు. సుమారు 80 వేల ఇళ్లు ఉన్న కార్పొరేషన్ పరిధిలో కేవలం ఒకే ఒక్క ఈ సేవ కేంద్రం ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హక్కు పత్రాలు... ముక్కు తిప్పలు...

ఇళ్ళ క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం నోటరీ లు కరెంట్ బిల్లు టాక్స్ బిల్లు ఇందులో ఏదైనా 2014 జూన్ 2 లోపు ఉన్న ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన కార్పొరేషన్ ప్రజలకు ముక్కు తిప్పలు తెచ్చిపెట్టాయి. ఏదోలా ఇళ్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ఈ సేవ ముందు నిరీక్షణ చేస్తున్న ప్రజలకు అంతరాలు తప్పడం లేదు. చిన్న చిన్న లోపాలు ఉంటే తిరిగి క్యూలైన్లో నిల్చోవలసి వస్తుంది. బయోమెట్రిక్ విధానంలో ఆధార్ కార్డు లింక్ సమన్వయం చేయడంతో ఈ -సేవ కేంద్రంలో ఒక్కొక్క దరఖాస్తుకు సుమారు 20 నుంచి 30 నిమిషాలు సమయం పడుతోంది. దీంతో ఈ సేవ ముందు ఎలాంటి వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జీవో నిబంధనలు సడలించి గడువు పెంచాలి

2014 జూన్ 2 కు ముందు నిబంధనలను 2021 వరకు మార్చాలని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2014 జూన్ 2 లోపు కొన్ని వేల స్థలాలు కొన్నామని, అప్పట్లో స్తోమత లేక ఇల్లు నిర్ణయించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 తర్వాతే నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నామని, 2021 లోపు నిర్మించిన ప్రతి ఇంటికి నివాస హక్కు కల్పించాలని ఇందుకు గాను జీవో నిబంధనలు సడలించి, గడువును పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం గౌరవించాలి- ప్రతిపక్షాలు

జవహర్ నగర్ భూముల పరిరక్షిస్తూ.. 2021 లోపు నివాసం ఉంటున్న ప్రతీ ఇంటికి ఇళ్ల క్రమబద్ధీకరణ కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కార్పొరేషన్ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రమంతా ఒకెత్తు.. జవహర్ నగర్ పరిస్థితులు ప్రత్యేకంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు, పాలకులు వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక అందించి జీవోను 2021 వరకు సడలించి, గడువును పెంచాలని తక్షణ కార్యాచరణ చేస్తూ, ప్రజాభీష్టాన్ని గౌరవించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    

Similar News