చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంపై ఉన్నతస్థాయి సమీక్ష
చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మినిష్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడురి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్దన్ రెడ్డి, రైల్వే కన్ స్ట్రక్షన్ సీఈ సుబ్రమణ్యం, రైల్వే సీనియర్ డెన్ కో అర్డినేషన్ రామారావు, కీసర ఆర్డీఓ పులి సైదులు, కాప్రా డిప్యూటీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రైల్వే స్టేషన్ కి అవసరమైన భూములు ఇచ్చేందుకు టీజీఐఐసీ, రెవెన్యూ, అటవీ భూములు కూడా కేటాయించేందుకు ఆయా శాఖల అధికారులు అంగీకరించారు. రాంపల్లి వైపు రోడ్లు, లైట్లు, ఇతర మౌలిక వసతులు వెంటనే పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అంతకంటే ముందు చర్లపల్లి రైల్వేస్టేషన్లో రైల్వే, మున్సిపల్, రెవెన్యూ, ఐలా, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, అధికారులతో స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. రైల్వే స్టేషన్ లో మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాజేందర్ సూచించారు. ఈ నెల 28 లోపు పనులన్నీ పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కోరారు. సమావేశం అయిన ఈటల రాజేందర్, మాజీ ఎంఎల్ఏ లు మిగిలి ఉన్న పనులు 28వ తేదీన జరుగనున్న స్టేషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు.