అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి

డాక్టర్ బీఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

Update: 2024-12-23 13:14 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : డాక్టర్ బీఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై దాడి చేయడంలో భాగంగానే అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ పై కించపరిచే విధంగా వ్యాఖ్యనించారని ఫైర్ అయ్యారు. సోమవారం తూంకుంటలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డిలతో కలిసి వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజ్యంగబద్దంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి రాజ్యాంగం రచించిన మహనీయుడిని చట్టసభలో అవమానించడం సరైన విధానం కాదని అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు మేధావిగా పేర్కొంటుంటే మన దేశంలో సాక్షాత్తు హోం మంత్రే ఇలా అవమానించడం సిగ్గు మాలిన చర్య అన్నారు. ఈ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండే ఓ వైపు రాజ్యాంగంపై,మరో వైపు లౌకికవాదంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    నిండు సభలో అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా సభ్యత్వాన్ని రద్దు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బహుజనుల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను తలుసుకుంటే ఏమొస్తదని, దేవున్ని తలుసుకుంటే పుణ్యం వస్తుందంటూ అవాకులు చెవాకులు పేల్చిన హోంమంత్రి అమిషాపై ప్రధాని నరేంద్ర మోడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోడీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు తన బంగళాను కూడా ఖాళీ చేయించారని గుర్తు చేశారు. అమిత్ షాపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై చర్యలు తీసుకునేంతవరకు ఇండియా కూటమి ఆందోళనలను కొనసాగిస్తుందని మేడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తూంకుంటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కు వినతి పత్రం అందించనున్నట్లు హరివర్దర్ రెడ్డి వెల్లడించారు.

    అదే విధంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనకు బాధ్యుడు అల్లు అర్జునేనన్నారు. ప్రభుత్వం అతనిపై కేసు పెడితే జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులంతా పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బాధితురాలు చనిపోయి, కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్న కుటుంబంపై కనీస జాలి చూపకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ మీడియా సమావేశంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్, మూడు చింతలపల్లి అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం ఏబీ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, వేముల మహేష్ కుమార్ గౌడ్, తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్ పేట్ మండల్ అధ్యక్షులు వై.శంకర్ గౌడ్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, దమ్మైగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు ముప్పు రామారావు, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్, పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఘట్కేసర్ మండల అధ్యక్షులు కర్రె రాజేష్, ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశాభివృద్దికి పీపీ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన అశయాలను కొనసాగిద్దామని పిలుపు ఇచ్చారు.


Similar News