అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పట్టణ ప్రగతి వనం

పచ్చదనం కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి వనాలు మందుబాబులకు,సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.

Update: 2024-06-28 14:56 GMT

దిశ, దుండిగల్ : పచ్చదనం కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి వనాలు మందుబాబులకు,సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఆనుకొని ఉన్న వీకర్ సెక్షన్ సాయి పూజ కాలనీ పట్టణ ప్రగతి వనంలో నిత్యం మందుబాబులు తిష్ఠ వేస్తూ రోడ్డున వెళ్లే పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి ఆనుకొని నాడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పట్టణ ప్రగతి వనం దుస్థితి ఇలా ఉంటే ఇక వేరే పట్టణ ప్రగతి వనాల దుస్థితి చెప్పనక్కరలేదు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం,పోలీస్ అధికారుల నిఘా వైఫల్యంతోనే మందుబాబులు రెచ్చిపోతున్నారంటూ స్థానికులు వాపోతున్నారు.

నిత్యం అసాంఘిక కార్యకలాపాలు

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని వీకర్స్ సెక్షన్ సాయి పూజా కాలనీ మేడ్చల్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడం, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో రాత్రి 8 దాటితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ ఉన్నా అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అసాంగిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,పోలీస్ ల నిఘా వైఫల్యం తోనే అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి

అస్తవ్యస్తంగా మారిన పట్టణ ప్రగతి వనాలు

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి వనాలు దుస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఓ వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, జులై నెల సమీపిస్తున్న హరితహారంపై ప్రస్తుత ప్రభుత్వం ఊసే ఎత్తకపోవడం తో,మున్సిపల్ అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పట్టణ ప్రగతి వానలో ఏర్పాటు చేసిన చెట్లు దట్టంగా పెరిగి గడ్డి పేరుకుపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు నిఘా పెంచి అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News