అక్కడ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు

వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తాగునీటి చెరువు నేడు మురుగునీటి కుపంగా మారింది. అంతేకాదు చెరువు విస్తీర్ణంలో ఎకరాల కొద్దీ ఆక్రమణకు గురైంది.

Update: 2024-08-29 03:01 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తాగునీటి చెరువు నేడు మురుగునీటి కుపంగా మారింది. అంతేకాదు చెరువు విస్తీర్ణంలో ఎకరాల కొద్దీ ఆక్రమణకు గురైంది. నివాస గృహాలు, అపార్ట్‌మెంట్స్, కంపెనీలు ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో వెలిశాయి. ఎందుకు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యక్షంగానే సహకరిస్తూ వస్తుంటే విద్యుత్ శాఖ అధికారులు పరోక్షంగా సహకరిస్తూ వస్తుండడంతోనే ఇన్ని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి అనేది వాస్తవం. చెరువుల ఆక్రమణ పై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ఫాక్స్ సాగర్‌ను సంబంధిత శాఖ అధికారులతో కలిసి సందర్శించి వివరాలు తెలుసుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫాక్స్ సాగర్ పైనే ఉంది.

అతిపెద్ద చెరువు ఇదే..

బ్రిటిష్ హయాంలో 18 వ దశాబ్దం చివరి అంకంలో ఈ చెరువును నిర్మించారు. సాగు, తాగునీటికి ఈ చెరువు నీటిని ఉపయోగించేవారు. కంటోన్మెంట్ బ్రిటిష్ సైనికులకు ఈ నీటిని తరలించే వారని సమాచారం. దీనికి సంబంధించిన శిలాశాసనం ఇప్పటికీ ఫాక్స్ సాగర్ చెరువు గట్టు పై కనిపిస్తుంది. 483 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉన్నట్లుగా 2016 లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో అధికారులు ధ్రువీకరించారు. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1 నుంచి 8 వరకు, 35 నుండి 43 వరకు, 48, 49 లలో, దుండిగల్ మండలం కొంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 109 నుంచి 115, 117, 118, 119, 150, అదేవిధంగా దూలపల్లి గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 121, 125 నుంచి 134, 165, 164 లలో ఈ చెరువు విస్తరించి ఉన్నది.

చెరువు ఎఫ్‌టీఎల్‌లోనే బస్తి..

కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉమామహేశ్వర నగర్ చెరువు లెఫ్ట్ ఎల్ బఫర్ జోన్ ప్రాంతంలోని అత్యధికంగా ఉన్నది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోని పట్టాల సైతం ఇవ్వడం జరిగింది. 2016, 2021 లో వచ్చిన వరదలతో రెండు మార్లు ఈ బస్తి పూర్తిగా నీట మునిగింది. నేటికీ కొన్ని ఇండ్లు ఇంకా నీటిలోనే ఉన్నాయి. అయితే చెరువు నీరు బస్తీలోకి రాకుండా చెరువు కట్టను అభివృద్ధి చేయడంతో ఈ చెరువు కట్ట దిగువ కొంతమంది భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయంపై కొందరు కలెక్టర్‌, తహసీల్ధార్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్మాణాలు ఆగటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వాచ్ టవర్ సాక్షిగా కబ్జాలు..

గడచిన పది సంవత్సరాల కాలంలో ఈ చెరువు అత్యధికంగా కబ్జాలకు గురైంది. చెరువు సంరక్షణ కోసం అధికారులు ఒక వాచ్ టవర్‌ను ఏర్పాటు చేశారు. 24 గంటలు సెక్యూరిటీని కూడా నియమించారు. ఈ సెక్యూరిటీ గస్తీ కాస్తూ వాచ్ టవర్ పైనుంచి గమనిస్తూ ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, పూడ్చివేతలు చేస్తున్నారు అనే విషయాలు గమనిస్తూ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాచ్ టవర్‌కు ఆనుకొని కొందరు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ సైతం నిర్మాణం చేశారు. పైగా అందులో వ్యాపార కార్యకలాపాలు సైతం చేస్తున్నారు. చెరువు బఫర్ జోన్ ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో జరిగిన నిర్మాణాలను మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ప్రత్యక్షంగానే సహకరిస్తూ ఉండగా అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ఆ శాఖ అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రంగనాథ్ పర్యటనతో గుబులు..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం ఈ చెరువును మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గత కొన్ని రోజులుగా ఈ చెరువుపై నివేదికలు తెప్పించుకుని చెరువు ఎంత మేరా కబ్జాకు గురైంది, తొలగించాల్సిన అక్రమ నిర్మాణాలు ఏమిటి అనే విషయాలపై ఆరా తీశారు. దీంతో ఫాక్స్ సాగర్ పై హైడ్రా ఫిక్స్ అయినట్లు గా భావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ చెరువు కబ్జాలను తొలగించి చెరువును సంరక్షించాలనే ఆలోచనలో హైడ్రా ఉన్నట్లుగా తెలుస్తుంది.

అడపదడపా ఫిర్యాదులు..

చెరువు కబ్జాలకు గురవుతుందని పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలో చెరువు కట్ట దిగువన బఫర్ జోన్ ప్రాంతంలో పదుల సంఖ్యలో వివిధ వర్గాలు మతాలకు చెందిన ఆలయాల పేరిట అన్యాక్రాంతం చేశారు. ఈ విషయంపై తాజాగా అప్పటి రెవెన్యూ అధికారి రేణుక పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కట్టడాలు ఆగడం లేదు. ఇక కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి, కొంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో పదుల సంఖ్యలో షెడ్ల నిర్మాణాలతో పాటుగా నివాస గృహాలు కూడా వెలిశాయి. చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో మట్టి వేసి పూడుస్తున్నారని మూడు నెలల క్రితం ఫేట్ బషీరాబాద్ పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. జూలైలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నాలుగు నిర్మాణాలను కూల్చివేశారు.


Similar News