KTR :పేదల ఇండ్లు కూల్చే కుట్రలు చేస్తే ఊరుకోం
పేదల ఇండ్లు కూల్చే కుట్రలు చేస్తే ఊరుకోమని మాజీ మంత్రి కేటీఆర్ (KTR)హెచ్చరించారు.
దిశ,ఉప్పల్ : పేదల ఇండ్లు కూల్చే కుట్రలు చేస్తే ఊరుకోమని మాజీ మంత్రి కేటీఆర్ (KTR)హెచ్చరించారు. నాచారంలోని సీవరేజ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఆదివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేదల ఇండ్లను కూల్చివేసి, బస్టాండ్, మెట్రో స్టేషన్ ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. మూసీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, ఇండ్లను కోల్పోతున్న పేదలకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం కేటీఆర్ మూసీ కలుషిత నీటిని,శుద్ధి చేసిన నీటిని మీడియా ముఖంగా ప్రజలకు చూపించారు. మూసీ వెంట ఇండ్లను కోల్పోతున్నవారికి అండగా నిలుస్తూ వారి తరఫున రాజ్యాంగ, న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని, ఇప్పటికే 500 మందికి ఊరటనిచ్చేలా హైకోర్టులో స్టే ఆర్డర్లు వచ్చాయన్నారు.
మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్, ఎస్టిమేషన్ లేనప్పుడు పేదల ఇండ్లను ఎందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు. పేదలను ఇబ్బంది పెడితే బీఆర్‌ఎస్ సహించబోదని, వారి ఇండ్లు కూల్చే కుట్రలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎస్టీపీలను సక్రమంగా నడిపితే నల్లగొండ జిల్లాకు పరిశుభ్రమైన నీరు వెళ్తుందని తెలిపారు. దక్షిణాసియాలోనే మొదటగా వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్ నిలిచిందని, ఇది కేసీఆర్ ఘనతేనని స్పష్టం చేశారు. గతంలోనే రూ. 3800 కోట్ల (Rs. 3800 crores)ఖర్చుతో ఎస్టీపీలను నిర్మించామని తెలిపారు. నగరంలో 57.5 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీకి పునరుజ్జీవం తేవాలంటే ముందుగా నీటిని శుద్ధి చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ సంకల్పించారని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ మూసీ ద్వారా నల్లగొండకు మురుగు నీరు పంపితే, బీఆర్‌ఎస్ హయాంలో శుద్ధజలాలను పంపించే ప్రణాళికలను అమలు చేశామని చెప్పారు.
బీఆర్‌ఎస్ కట్టిన ఇండ్లకు సున్నం వేసి నేనే కట్టించిన అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్నాడని ఎద్దేవా చేశారు. మూసీని శుద్ధి చేసేందుకు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. దీనికి 2023లోనే రూ. 1100 కోట్లతో మూసీ అనుసంధాన పనులు చేపట్టినట్టుగా చెప్పారు. ఇక ఎస్టీపీలు, బ్రిడ్జిలు, గోదావరి అనుసంధానంతో మూసీకి పునరుజ్జీవం పోసిందే బీఆర్‌ఎస్ అని మరోసారి స్పష్టం చేశారు. మూసీ డెవలప్ అథారిటీ చైర్మన్‌గా సుధీర్‌రెడ్డి ఉన్నప్పుడే పనులన్నీ దాదాపు పూర్తి చేశామని తెలిపారు. అన్నింటికీ కలిపి రూ. 25వేల కోట్లతో మూసీకి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. పేదల ఇండ్లను కూల్చి, అవినీతి మూటలు ఢిల్లీకి తరలిస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ బ్యూటిఫికేషన్‌కు వ్యతిరేకం కాదని, మీ లూటిఫికేషన్‌కు వ్యతిరేకం అని ధ్వజమెత్తారు.
బఫర్‌జోన్‌లో అనుమతులతో ఇండ్లు కట్టుకున్నవారిని కబ్జాదారులని సీఎం రేవంత్‌రెడ్డి ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. లక్షల మందిని రోడ్డున పడేసి, కోట్లాది రూపాయలు దోచుకుంటామంటే బీఆర్‌ఎస్ ఎలా మద్దతునిస్తుందని ప్రశ్నించారు. మూసీ పేరిట లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని అన్నారు. అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 100 మందికి పైగా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు ఫీజు మొత్తం చెల్లించే చెక్కుల పంపిణీ కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి, కార్పొరేటర్లు శాంతి సాయిజెన్ శేఖర్, బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కొత్త రామారావు, నాయకులు సాయిజెన్ శేఖర్, బన్నాల ప్రవీణ్ పాల్గొన్నారు.