చికెన్ లొల్లి.. ఆగిన పెళ్లి

షాపూర్ నగర్ లో వరుడి మిత్రులకు చికెన్ పెట్టలేదంటూ ఆగిపోయిన పెళ్లి

Update: 2022-11-28 05:52 GMT

దిశ, పేట్ బషీరాబాద్: వివాహ విందులో వచ్చిన మిత్రులకు చికెన్ పెట్టలేదని మొదలైన గొడవ చిలికి చిలికి ఘర్షణగా మారింది. దీంతో ఆఖరి నిమిషంలో జరగాల్సిన వివాహ వేడుక ఆగిపోయిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం .. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన వరుడుకు, కుత్బుల్లాపూర్ కు చెందిన వధువుకు పెద్దల సమక్షంలో ఆదివారం వివాహం చేయడానికి అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. పెండ్లిని షాపూర్ నగర్ లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివాహ ముహూర్తం ఉండగా అంతకుముందు ఆదివారం రాత్రి వివాహ వేడుకను ఫంక్షన్ హాల్ లోని ఏర్పాటు చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన మార్వాడీ కుటుంబాలు కావడంతో వారి సంప్రదాయం ప్రకారం వివాహ విందులో వధువు తరుపున శాఖాహారం వంటలను వడ్డించారు. దాదాపుగా వివాహ విందు పూర్తవుతుండగా ఎంటర్ అయ్యారు వరుడు తరఫు మిత్రులు.

మిత్రులు తినకుండా వెళ్లడంతో..

విందు పూర్తయ్యే సమయానికి వరుడి మిత్రులు భోజనానికి వచ్చారు. భోజనంలో అన్ని శాఖాహారానికి చెందిన పదార్థాలు ఉండటంతో '' కూరగాయల భోజనం రోజూ తింటలేమా? చికెన్ లేకుండా పెళ్లి ఏంటి'' అంటూ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ భోజనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వరుడి తరపు బంధువులు ఆహార పదార్థాలు అసంపూర్తిగా ఉన్నాయంటూ, వచ్చిన వారికి కావలసింది వడ్డించలేదంటూ వధువు తరపు వారిని హేళన చేస్తూ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువైపుల బంధువులు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ గొడవలో ఇద్దరు మహిళలు స్పృహతప్పి పడిపోవడంతో వాళ్లను హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లు వినకుండా వివాహాన్ని రద్దు చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ చేసి తిరిగి వివాహాన్ని జరిపించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: వంట గదిలో భార్య పని ముగించిన భర్త.. వాళ్ల ఎంట్రీతో సీన్ రివర్స్ 

Tags:    

Similar News