పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

సమాజంలో నిత్యం ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.

Update: 2025-01-05 14:20 GMT

దిశ, తిరుమలగిరి : సమాజంలో నిత్యం ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్ పల్లి పబ్లిక్ సెక్టార్ కాలనీలో సికింద్రాబాద్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సోహైల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతో పాటు తెలంగాణ శానససభ స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం ప్రతినిత్యం ప్రయాణించే రోడ్లు, కాలనీలలోని పరిసరాలను శుభ్రంగా ఉన్నాయంటే పారిశుద్ధ్య కార్మికుల కృషే అందుకు కారణం అన్నారు.

     కార్మికులు వారి ఆరోగ్యాలను ఫణంగా పెట్టి సమాజం కోసం పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి వారి కోసం సికింద్రాబాద్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సోహైల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కిట్స్ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని, పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవ వల్లనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం సైతం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తాను కూడా ప్రతి నెలా వారి కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తానని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ట్రెంచింగ్ లాండ్ ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్కడ పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్మికులకు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా తాను క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Similar News