ఆదాయం పెంపు దిశగా పోచారం మున్సిపాలిటీ..
ఆదాయం పెంపు కోసం పోచారం మున్సిపాలిటీ పాలకవర్గం,
దిశ,ఘట్కేసర్ : ఆదాయం పెంపు కోసం పోచారం మున్సిపాలిటీ పాలకవర్గం, సిబ్బంది తీవ్ర కసరత్తు చేస్తున్నారు.18 వార్డులున్న పోచారం మున్సిపాలిటీలో ప్రతాప సింగారం, కాచివానిసింగారం, కొర్రముల, వెంకటాపూర్, చౌదరిగుడా గ్రామ పంచాయతీలు విలీనమైన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలు విలీనం కాకముందుకు పోచారం మున్సిపాలిటీలో 197 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా మరో 211 మంది పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది చేరారు. కాగా మున్సిపాలిటీ కార్యాలయంలో 29 మంది ఔట్ సోర్సింగ్, 24 మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీకి వివిధ పన్నుల రూపంలో దాదాపు రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు పారిశుధ్య కార్మికులకు జీతభత్యాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్లు తెలిసింది. ఎలాగైనా ఆదాయాన్ని పెంచుకోవాలని పాలకవర్గం సర్వసభ్య సమావేశంలో కార్పొరేట్ విద్యా సంస్థలు, హాస్టళ్లు నిర్వహిస్తున్న బహుళ అంతస్తుల యజమానుల నుంచి పన్నులు రాబట్టుకునేందుకు రీ అసెస్మెంట్ తీర్మానాలు చేసి నోటీసులు జారీ చేశారు.
కార్పొరేట్ విద్యా సంస్థలకు నోటీసులు...
పాలకవర్గం పదవీ కాలం మరో 20 రోజుల్లో పూర్తి కానుంది. గత ఐదేళ్ల నుంచి మున్సిపాలిటీకి సరిగా పన్నులు కట్టని కార్పొరేట్ విద్యా సంస్థలైన రాక్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో పాటు, మున్సిపాలిటీ పరిధిలో బహుళ అంతస్తులలో దాదాపు 90కి పైగా హాస్టళ్లు నిర్వహిస్తున్న యజమానులకు రీ అసెస్మెంట్ కోసం నోటీసులు జారీ చేశారు. వాణిజ్య వ్యాపారాలు చేస్తున్న బహుళ అంతస్తుల యజమానులు పన్నులు చెల్లించడం ప్రారంభించారు. కానీ సంవత్సరానికి రూ.కోటిన్నరకు పైగా పన్ను చెల్లించాల్సిన శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం దాదాపు రూ.28 లక్షల మాత్రమే చెల్లిస్తుందని, రాక్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం కూడా సంవత్సరానికి దాదాపు రూ. 60 లక్షలు పన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.16 చెల్లిస్తున్నట్లు సమాచారం. పాత పద్ధతిలోనే పన్నులు చెల్లిస్తామని రాయబారాలు చేయడం, కొందరు రాష్ట్ర ఉన్నతాధికారులతో ఫోన్లు చేయిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సీడీఎంఏ అధికారులతో పైరవీలు...
మున్సిపాలిటీ ఏర్పాటైన నాటినుండి రాక్ వుడ్, శ్రీనిధి కళాశాల యాజమాన్యాలను పన్నుల వసూళ్ల పై ఎవరైనా అడిగితే సీడీఎంఏ( కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో, అప్పటి బీఆర్ఎస్ మంత్రులతో ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడే వారని కొందరు ప్రజా ప్రతినిధులు తెలిపారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఇన్ఫోసిస్, రహేజా, సంస్కృతి టౌన్షిప్ లతో ఎన్నో కాలనీలు సకాలంలో పనులు చెల్లిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తున్నారు. కానీ శ్రీనిధి, రాక్ వుడ్ విద్యాసంస్థలు మాత్రం వారి వైఖరి మార్చుకోక పోవడంతో పాలకవర్గం సభ్యులంతా ఇటీవల జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో రీ అసెస్మెంట్ కోసం తీర్మానం చేశారు. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులను ఎగవేసేందుకు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు రాష్ట్ర ఉన్నతాధికారులను, సీఎంను మంత్రులను ముందే కలిసి కుట్రలు పన్నకుండా ముందస్తుగానే సీఎం రేవంత్ కు, సీడీఎంఏ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినట్లు సమాచారం. పన్నుల చెల్లింపు విషయంలో ఇప్పటికైనా కార్పొరేట్ విద్యా సంస్థలు వారి వైఖరి మార్చుకోకపోతే పోచారం మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో విద్యాసంస్థల ముందు ధర్నాకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
తగ్గేదే లేదు అంటున్న చైర్మన్ కొండల్ రెడ్డి...
మున్సిపాలిటీ ఆదాయం పెంపు విషయంలో తగ్గేదేలేదని చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అంటున్నారు. మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలు విలీనమైన తర్వాత సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించడం కష్ట సాధ్యమవుతుందని, పాలకవర్గం పదవీకాలం పూర్తయ్యే నాటికైనా మున్సిపాలిటీ ఆదాయం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికైనా స్పందించి రీ అసెస్మెంట్ చేయించుకొని మున్సిపాలిటీ చెల్లించాల్సిన పన్నులను వెంటనే చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. లేనిపక్షంలో సంస్థల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.