ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..
ఆశ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏ అశోక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : ఆశ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏ అశోక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు పర్మినెంట్ చేయాలని ఆలోపు మిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రేవతి, హేమలతలు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిందన్నారు..
బీఆర్ఎస్ కంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిందన్నారు. ఆశాల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని. కానీ ఆశాల సమస్యలు మాత్రం నేటికీ పరిష్కారం చేయలేదన్నారు. సమస్యలు పరిష్కరంచాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆశాలు అనేకసార్లు వినతిపత్రాల ద్వారా విజ్ఞప్తులు చేశారని, ఇప్పటికీ నిరంతరం నిరసనలు, పోరాటాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి కె.ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి తమ సమస్యలను చెప్పుకుందాం అంటే జిల్లాలో ఆశా కార్యకర్తలను రాత్రికి రాత్రి ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికీ దాదాపు 300 మంది ఆశావర్కర్లని, సీఐటీయూ జిల్లా నాయకులు రాజశేఖర్ లింగస్వామిను అరెస్టు చేశారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ శామీర్పేట్ కార్యదర్శి కృష్ణప్ప డిమాండ్ చేశారు.