తైబజార్ లో తప్పుడు లెక్కలు.. అందినకాడికి నొక్కేస్తున్న ఘనుడు

దుండిగల్ మున్సిపాలిటీలో తైబజార్ సొమ్ము ఎవరి జోబుల్లోకి వెళ్తుందో అర్ధం కావడం లేదు.

Update: 2025-03-21 11:00 GMT
తైబజార్ లో తప్పుడు లెక్కలు.. అందినకాడికి నొక్కేస్తున్న ఘనుడు
  • whatsapp icon

దిశ, దుండిగల్ : దుండిగల్ మున్సిపాలిటీలో తైబజార్ సొమ్ము ఎవరి జోబుల్లోకి వెళ్తుందో అర్ధం కావడం లేదు. వసూలు చేసే డబ్బులకు మున్సిపల్ లో చెల్లించే లెక్కలకు పొంతన లేకుండా పోవడం పలు విమర్శలకు తావిస్తుంది. తైబజార్ వేలంపాట నిర్వహించేందుకు అవకాశం ఉన్నా అధికారులు తమ స్వలాభం కోసం వేలంపాట నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వసూళ్లు వేలల్లో ఉన్నా మున్సిపల్ లో జమ చేసేది మాత్రం వందల్లో ఉంటున్నట్లు సమాచారం. మిగిలిన సొమ్ము ఎవరి జోబుల్లోకి వెళ్తుంది.. ఎవరికి ఎంత వాటా అందుతుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీలో ఉన్న మార్కెట్లు, ఇతర విక్రయ షాప్ లు,వారాంతపు సంతల ద్వారా తైబజార్ వసూల్ చేస్తారు.

    కూరగాయల దుకాణాన్ని బట్టి 20 నుండి 50 రూపాయలు, మార్కెట్లో నిర్వహించే ఇతర షాప్ లకు వాటి నిర్వహణను బట్టి వసూలు చేస్తారు. వసూళ్ల కోసం ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక జవాన్ కు బాధ్యతలు అప్పగించారు. ఇద్దరూ విధులు నిర్వహించాల్సి ఉన్నా జవాన్ ఒక్కడే పని చేస్తున్నాడు. కాగా వసూలు చేసే డబ్బులకు మున్సిపల్ లో జమ చేసే వాటికి పొంతన ఉండడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి దుకాణదారునికి ఆన్ లైన్ రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. రసీదులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వసూల్ చేస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీ లో 6 గ్రామాలు ఉండగా సంతలు వారంలో సుమారు 20 నిర్వహిస్తున్నారు. ఒక్కో సంతలో సుమారు 150 దుకాణాల వరకు ఉంటాయి.

    150 దుకాణాల ద్వారా ఒక్కో దుకాణం నుండి 20 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నా వారంలో 75 వేల వరకు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు సుమారు 3 లక్షల 75 వేల వరకు వసూలు అవుతాయన్నమాట. ఇవి కాక మార్కెట్లలోని ఇతర షాప్ ల నుండి వచ్చే ఆదాయం వేరుగా ఉంటుంది. వచ్చిన సొమ్మును ఏ రోజుకు ఆరోజు మున్సిపల్ కార్యాలయంలో జమ చేయాల్సి ఉంటుంది. నెలకు సుమారు రూ.లక్ష 87 వేల వరకు మాత్రమే జమ చేస్తూ మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగిలిన సొమ్ములో ఎవరి వాటా ఎంత అనే అనుమానాలు కలుగుతున్నాయి.

వేలంపాటలో కాలయాపన..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లలో ఇప్పటికే తైబజార్ వేలం పాటలు ముగిశాయి. వేలం పాట అనంతరం తైబజార్ లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. మున్సిపల్ చట్టానికి లోబడి కాంట్రాక్టర్ దుకాణాల వద్ద వసూలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా దుండిగల్ మున్సిపాలిటీలో తైబజార్ వేలంపాట నిర్వహించకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఎవరు స్వలాభం కోసం వేలంపాట నిర్వహించడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి.

తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు : మున్సిపల్ కమిషనర్

తైబజార్ వసూళ్ల పై దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ ను వివరణ కోరగా తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి దుకాణదారునికి ఆన్ లైన్ రసీదు ఇస్తున్నామన్నారు. విచారణ చేపడతామని, రసీదులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. త్వరలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


Similar News