పార్క్ స్థలం కబ్జా.. ఫిర్యాదు చేసిన వాళ్లనే స్టేషన్ కు తరలింపు.. అసలు ఏం జరిగిందంటే..

ప్రజా అవసరాల కోసం వదిలిపెట్టిన పార్కు స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, కాలనీవాసులు సంబంధిత శాఖ అధికారులతో పాటుగా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు.

Update: 2023-02-11 13:30 GMT

దిశ, పేట్ బషీరాబాద్, దుందిగల్: ప్రజా అవసరాల కోసం వదిలిపెట్టిన పార్కు స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, కాలనీవాసులు సంబంధిత శాఖ అధికారులతో పాటుగా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణమని తెలిసి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. కాగా కాలనీవాసులు ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజులకు కాలనీలో పోలీసులు ప్రత్యక్షమయ్యారు. మాట్లాడాలి అంటూ పిలిచిన కాలనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో ఫిర్యాదు చేసిన తమనే అన్యాయంగా పోలీసులు స్టేషన్ కు తరలించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుండిగల్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. ఇది సూరారంకాలనీ సిద్ధి వినాయక నగర్ లో విస్తరించి ఉన్నా పార్కు స్థలం వివాదం.


అసలు వివాదం ఏంటంటే.. ?

సూరారంకాలనీ సర్వేనెంబర్ 105 లో 1978 సంవత్సరంలో సిద్ధి వినాయక నగర్ కాలనీ లేఅవుట్ చేశారు. ఇందులో ఎమినిటీస్ లో భాగంగా అప్పట్లో 1080 గజాల స్థలం పార్క్ కోసం విడిచిపెట్టారు. ఈ స్థలంలో కొందరు అక్రమంగా నిర్మాణ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో 2016లో ఈ స్థలంలో ఓ ఇంటిని నిర్మాణం చేసినప్పుడు అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణం అక్రమమని కూల్చేశారు. కబ్జాకుయత్నం చేస్తున్న పార్కు స్థలాన్ని గతంలో ఎల్అర్ఎస్ కోసం కబ్జాదారులు దరఖాస్తు చేసుకోగా దాన్ని సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రద్దు చేసినట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు. తాజాగా ఇదే పార్కు స్థలంలో తిరిగి నిర్మాణ పనులు చేపట్టడంతో ఈ నెల 8వ తేదీన కాలనీవాసులు సదరు పార్కు స్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటుగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు.

ఒకరు చర్యలు తీసుకున్నారు.. ఒకరు మిన్నకున్నారు..

సిద్ధి వినాయక నగర్ కాలనీవాసులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో పాటుగా దుండిగల్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి సాధారణ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారిని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదు ఇచ్చిన వాళ్లనే అదుపులోకి..

రెండు రోజుల క్రితం కాలనీవాసులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా శనివారం పోలీసులు సిద్ధి వినాయకనగర్ కు వచ్చి కాలనీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు దారం సాయికుమార్ లను స్టేషన్ కు తరలించారు. కబ్జా నుంచి పార్కు స్థలాన్ని కాపాడండి, మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ కాలనీవాసులు ఫిర్యాదు చేస్తే వారిని స్టేషన్ కు తీసుకెళ్లడం విషయమై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా..

తమ కాలనీ అసోసియేషన్ సభ్యులను స్టేషన్ కు తీసుకెళ్లారని తెలుసుకున్న కాలనీవాసులు దుండిగల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా తమ అసోసియేషన్ సభ్యులను ఏ విధంగా పోలీస్ స్టేషన్ కు తీసుకు వస్తారంటూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న బీజేపీ, కాలనీవాసులకు మద్దతు తెలుపుతూ సిద్ధి వినాయకనగర్ వాసులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట చేసిన ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను రక్షించకపోగా కబ్జా చేసే వారికి మద్దతుగా ఉంటున్నారని పోలీసులపై ఆరోపణలు చేశారు.

రాజకీయ ఒత్తిడితోనేనా..?

సూరారం ప్రధాన రహదారికి అతి దగ్గరగా ఉన్న ఈ పార్కు స్థలం విలువ ఇప్పుడు కోట్లలో ఉంటుంది. దీనిని కొందరు రాజకీయ పలుకుబడితో కబ్జాకు యత్నం చేస్తున్నారని, వారి ఒత్తిడితోనే పోలీసులు ముందుగా తాము ఇచ్చిన ఫిర్యాదు గురించి పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రాజకీయ ఒత్తిడితోనే మాపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

ఫిర్యాదు రావడంతోనే స్టేషన్ కు పిలిచాం: సీఐ రమణారెడ్డి, దుండిగల్ పోలీస్ స్టేషన్

కాలనీ అసోసియేషన్ సభ్యులపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తమ స్థలంలో అక్రమంగా చొరబడ్డారని సదరు మహిళల ఫిర్యాదులో పేర్కొనడంతోనే వారిని స్టేషన్ కు పిలిపించి మాట్లాడి పంపించాను. అంతేగాని ఎవరిని అరెస్ట్ చేయలేదు. 

Tags:    

Similar News