సెక్యూరిటీ గార్డు ప్రాణం తీసిన లారీ

రోడ్డు ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డు మృతి చెందిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-12-03 15:27 GMT

దిశ, కూకట్​పల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డు మృతి చెందిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్​బీ పోలీసులు ఎస్సై శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన సాలెగ రమేష్​(43) తన కుటుంబ సభ్యులతో నగరానికి వలస వచ్చి గాజుల రామారం వీణ ఎన్​క్లేవ్​లో నివసం ఉంటున్నాడు.

    రమేష్​ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండే వాడు. రోజు వారి మాదిరిగానే రమేష్​ విధులు ముగించుకుని మంగళవారం తెల్లవారు జామున 3:45 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా కేపీహెచ్​బీ కాలనీ ఆల్​మండ్​ స్వీట్​హౌస్​ ఎదురుగా యూ టర్న్​ చేస్తుండగా వెనక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన గుర్తు తెలియని లారీ రమేష్​ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన రమేష్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

     సమాచారం అందుకున్న కేపీహెచ్​బీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రమేష్​ వద్ద ఉన్న సెల్​ ఫోన్​లో లభించిన వివరాల ప్రకారం రమేష్​ భార్య సాలెగ భారతికి సమాచారం అందించారు. తన భర్త మరణానికి కారణమైన లారీ డ్రైవర్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీలత తెలిపారు. 


Similar News