నేలను సంరక్షించుకోవాలి
మానవాళికి ఆహారం అందించే నేలను సంరక్షించుకోవాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ అన్నారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : మానవాళికి ఆహారం అందించే నేలను సంరక్షించుకోవాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ అన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 5న నిర్వహించనున్న ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని అన్ని రైతువేదికలలో మృత్తిక (నేల) సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మానవాళికి ఆహారం అందించే నేలని సంరక్షించుకున్నట్లయితేనే భావితరాలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తుల్ని అందించగలమన్నారు. ఈ కార్యక్రమాలు ప్రతి రైతు వేదికలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమానికి రైతులు, ప్రజాప్రతినిదులు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం తోపాటు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు కూడా ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేకరించే పద్ధతితోపాటు నేల ఆరోగ్య సూచికను ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా ఆయా క్లస్టర్లలో ఉన్న నేలల స్వభావాన్ని, వాటి యాజమాన్య పద్ధతుల్ని, తగిన పంటల సరళిని, యాసంగి పంట సాగులో పాటించాల్సిన మెళకువలని తెలియజేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని మృత్తిక (నేల) సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.