హెచ్ఐవీ రోగులను కరుణతో చూడాలి
హెచ్ఐవీ రోగులను కరుణతో చూడాలని టీజీఎస్ఏసీఎస్ రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్ పి.ప్రసాద్ అన్నారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : హెచ్ఐవీ రోగులను కరుణతో చూడాలని టీజీఎస్ఏసీఎస్ రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్ పి.ప్రసాద్ అన్నారు. ఎయిడ్స్ రోగులకు మానసిక ప్రశాంతత అందించాలని పేర్కొన్నారు. జిల్లా పోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో బుధవారం మల్కాజ్ గిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సంవత్సరం థీమ్ ‘టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ , మై రైట్ ’గా ప్రకటించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ 2010 సంవత్సరంలో హెచ్ఐవీ ప్రభావం 0.84 శాతం ఉండగా, 2024 నాటికి 0.44 శాతం తగ్గడం శుభాపరిణామమన్నారు.
రాష్ట్రంలో 30 ఆర్టీ (ఆంటీ రిట్రోవైరల్ థెరపీ) కేంద్రాలు హెచ్ఐవీ బాధితులకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ రఘునాథ స్వామి హెచ్ఐవీ నిర్మూలన కోసం ప్రతిజ్క్ష చేయించారు. పలు విద్యా సంస్థలు, విద్యార్థులు నిర్వహించిన పోస్టర్ మేకింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు, వాలంటీర్లకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఉప జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు డాక్టర్ శోభారాణి, డాక్టర్ సత్యవతి, ప్రొగ్రామ్ అధికారి డాక్టర్ గీతా ప్రసాద్, ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ సరస్వతి, టీడీ మినీ హాబ్ ల ప్రోగ్రాం అధికారి డాక్టర్ పద్మావతి, సహాయ అధికారి డాక్టర్ కౌశిక్, డాక్టర్ విజయ నిర్మల, డాక్టర్ వెంకట్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.