ఇంటర్ విద్యార్థి ప్రాణం ఖరీదు రూ.30 లక్షలు ..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో నారాయణ కళాశాలలో సోమవారం ఇంటర్ విద్యార్థి బానోత్ తనుష్ నాయక్ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది.

Update: 2024-12-03 08:03 GMT

దిశ, ఘట్కేసర్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో నారాయణ కళాశాలలో సోమవారం ఇంటర్ విద్యార్థి బానోత్ తనుష్ నాయక్ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. సోమవారం అర్ధరాత్రి వరకు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాలు (ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్) న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేసి ప్రిన్సిపల్ రామ్ రెడ్డి పై దాడి చేశారు. తన కొడుకును అన్యాయంగా చంపేశారు అంటూ విద్యార్థి తండ్రి జగన్నాథం మీడియా ముందు బోరున విలపించాడు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత నారాయణ కాలేజీ యాజమాన్యం మృతుడి తల్లిదండ్రులు, బంధువులతో చర్చలు జరిపి రూ.30 లక్షలు చెల్లించేందుకు సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం.

మంగళవారం తెల్లవారుజాము వరకు కళాశాలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ గ్రామాలకు పంపించేశారు. విద్యార్థి మృతి చెంది 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోవడం పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే మంగళవారం విద్యార్థి సంఘాలు ఎవరైనా వచ్చి ఆందోళన చేపడతారని ముందస్తుగానే భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. విద్యార్థి పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేగానీ విద్యార్థి హత్యకు గురయ్యాడా... ఆత్మహత్య చేసుకున్నాడా అనే అసలు విషయాలు తెలియాల్సి ఉంది. అప్పటి వరకు కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


Similar News