కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 'సై' అంటున్న టీడీపీ.. పూర్వ వైభవం కోసం గట్టి ప్రయత్నాలు
దిశ, కంటోన్మెంట్: సైకిల్ సవారికి సిద్ధమేనా..? తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటుందా..? రాబోయే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయబోతుందా..? ఆ పార్టీని మళ్లీ ప్రజలు ఆదరిస్తారా..? పార్టీ నేతలకు బాబు ఎలాంటి మార్గనిర్దేశం చేశారు..? తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఠానేశ్వర్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఏ వ్యుహాం రచించబోతున్నారు..? ప్రస్తుతం ఏప్రిల్ 30వ తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలి ఎన్నికల నేపథ్యంలో తాజా టీడీపీ పరిస్థితిపై ‘దిశ‘ ప్రత్యేక కథనం..
1985 నుంచి టీడీపీ హావా..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 1985వ సంవత్సరం 2018 వరకు టీడీపీ తన హావాను కొనసాగించింది.ఎనిమిది పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఐదు సార్లు విజయ ఢంకా మోగించింది. మిగితా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి టీఆర్ఎస్ పార్టీలు గెలుపొందాయి. 1985 జరిగిన ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్యే గా తొలిసారిగా ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ లో అడుగు పెట్టారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో డి. నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి, మంత్రి అయ్యారు. అనంతరం 1994, 1999, 2004 లలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వరుసగా గెలుపొంది జి.సాయన్న హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు.
2009లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి.శంకర్ రావు చేతిలో సాయన్న ఓటమి పాలవ్వగా, శంకర్ రావు ను మంత్రి పదవి వరించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రమంతటా టీఆర్ఎస్ కు సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, 2014 ఎన్నికల్లో కూడా సాయన్న టీడీపీ తరపుననే విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ నుంచి సాయన్న ఐదో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే సాయన్న పార్టీ మారడంతో టీడీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన వెంట టీఆర్ఎస్ లో చేరారు. లీడర్లు వెళ్లినా.. కంటోన్మెంట్ లో క్యాడర్ మాత్రం ఇప్పటికి బలంగానే ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పూర్వ వైభవం కోసం..
తెలంగాణలో పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆ పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేసిందో.. ప్రజలకు వివరించాలని, టీడీపీ హాయంలోనే హైదరాబాద్, సైబరాబాద్ మహా నగరంలా మారాయాన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బాబు సూచించినట్లు తెలిసింది.
తెలంగాణలో టీడీపీకి క్యాడర్ బలంగా ఉందని, నేతలు పోయినా.. ఉన్న క్యాడర్ ను ఉప యోగించుకోవాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఠానేశ్వర్ నేతృత్వంలో ఇందుకు తగ్గ ప్లాన్ రూపొందించాలని , సభ్యత్వ నమోదు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించాలని బాబు నేతలకు సూచించారు.ఈ క్రమంలోనే కంటోన్మెంట్ లో పార్టీ సీనియర్ నేత, బోయిన్ పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ నేతృత్వంలో సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపడుతున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తో ప్రజల్లోకి వెళ్లుతున్నారు.
బోర్డు ఎన్నికల్లో పోటీకి సై..
సుదీర్ఘకాలంగా కంటోన్మెంట్ లో బలంగా ఉన్న టీడీపీ ఈసారి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేత ముప్పిడి గోపాల్ నేతృత్వంలో 8 వార్డులలో అభ్యర్థులను పోటీ చేయించేందుకు కార్యచరణను రూపొందించినట్లు సమాచారం. బోర్డు ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టే విషయమై ఇప్పటికే తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఠానేశ్వర్ తో ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలిసింది. జ్ఠానేశ్వర్ సైతం కంటోన్మెంట్ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలిపేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీని నమ్ముకుని ఉన్న క్యాడర్ నే బోర్డు ఎన్నికల్లో పోటీ చేయించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
పార్టీ తరపున వీరికి ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా క్యాడర్ లో జోష్ నింపడంతోపాటు, నగర వ్యాప్తంగా పార్టీకి ఉన్న ఆదరణను అంచనా వేయచ్చనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు. అయితే ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం.. అందుకోసం కేంద్రం ఓ కమిటీని వేసిన విషయం విధితమే.
అయితే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి జార్జీ పెర్నాండెజ్ ను ఒప్పించి,కంటోన్మెంట్ ను విలీనం చేసేందుకు బాబు చూపిన చొరవను బోర్డు ఎన్నికల ప్రచారం లో విస్తృతంగా ప్రచారం చేయాలని లోకల్ లీడర్లకు రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు ఓ ముఖ్య నేత ‘దిశ’ తో పేర్కొన్నారు. ఒకవేళ బోర్డు ఎన్నికల్లో ‘8 వార్డులకు గాను టీడీపీ అభ్యర్థులనే గెలిపించినట్లయితే బోర్డు ఆమోదంతో విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఓటర్లకు వివరించాలని కోరినట్లు ఆయన తెలియజేశారు.