శివారు మున్సిపాలిటీలు బల్దియాలోకి.. స్పీడ్ అందుకున్న ప్రక్రియ!

బల్దియాలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ స్పీడందుకుంది.

Update: 2024-06-29 02:09 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: బల్దియాలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ స్పీడందుకుంది. మేడ్చల్ జిల్లాలోని నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీల విలీనానికి జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో.. ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో మళ్లీ విలీన ప్రక్రియలో వేగం పుంజుకుందని అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా జలమండలి నిర్వహిస్తున్న తీరుతో పాటు జీహెచ్ఎంసీలో పౌర సేవలను కొనసాగించేందుకు అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో విలీన సాధ్యాసాధ్యాలపై రెవెన్యూ, పురపాలక శాఖలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోనే అధికం..

రాష్ట్రంలోనే మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజాంపేట, జవహర్ నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ నాలుగు కార్పొరేషన్లు ఉండగా, ఘట్ కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, తూంకుంట, కొంపల్లి, మేడ్చల్, గుండ్లపోచం పల్లి, దుండిగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే నాటికి విలీనం చేయాల్సి ఉంది. ఒకవేళ చేయాల్సి వస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆరు జోన్లలో వీటిని కలపాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రేటర్ లో కోటిన్నర కు పైగా జనాభా ఉంది. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేస్తే రెండు కోట్లకు పైగా జనాభా చేరుకుంటుంది.

మిగులు బడ్జెట్‌తో..

బల్దియాతో పోలిస్తే శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. బల్దియాకు అప్పటి ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా నయా పైసా ఇవ్వకపోవడంతో అప్పుల పాలైంది. కానీ నిజాంపేట, పీర్జాదిగూడ, బోడుప్పల్ లాంటి కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నులు తదితర వాటి నుంచి వందశాతం వసూలు అవుతుండడంతో మిగులు బడ్జెట్‌తో ఉన్నాయి. ఒక్క జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ పేదల బస్తీలు ప్రభుత్వ భూముల్లో ఏర్పడడంతో పన్నుల వసూళ్లు సాధ్యం కావడం లేదు. జవహర్ నగర్ మినహా మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఇబ్బందులు లేవు. అదే బల్దియాలో విలీనం చేస్తే ఆ ఆదాయం అంతా జీహెచ్ఎంసీకే పోతుంది. విలీనానికి ముందు స్థానిక ప్రజల నుంచి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. అయితే జీహెచ్ఎంసీలో విలీనం చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గ్రామ పంచాయితీలనే..

మెరుగైన పాలన కోసమంటూ 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీలను కలిపి కొత్తగా నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఎన్నికలు నిర్వహించి అన్ని స్థానాలను గులాబీ పార్టీ తన ఖాతాలోనే వేసుకుంది. కాగా వచ్చే ఎన్నికల నాటికి జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం విలీనానికే మొగ్గు చూపడంతో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాజకీయ, అధికార వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ప్రతిపాదనలు ఇలా..

జిల్లాలోని శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాల్లో విలీనం చేయాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోకి నిజాంపేట కార్పొరేషన్‌తో పాటు దుండిగల్, కొంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీలు, అల్వాల్ సర్కిల్‌లో తూంకుంట మున్సిపాలిటీతో పాటు జవహర్‌నగర్ కార్పొరేషన్ ను విలీనం చేయాలని అనుకుంటున్నారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలోకి పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట కార్పొరేషన్ల తో పాటు పోచారం మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పోచారం లేదా ఘట్ కేసర్ మున్సిపాలిటీలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నారు.

Similar News