పార్కులు కబ్జా... పైగా తేలు కుట్టిన దొంగల్లా తమకు తెలయదంటూ దాటవేత!

పార్కులు మాయమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కట్టడి చేయాల్సిన... Special Story

Update: 2023-02-12 07:31 GMT

దిశ, కంటోన్మెంట్: పార్కులు మాయమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కట్టడి చేయాల్సిన అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో కంటోన్మెంట్ బోర్డులో పర్యావరణ సమతూల్యత దెబ్బ తింటుంది. పౌరులు అహ్లాద వాతావరణానికి దూరమవుతున్నారు. గతంలో కబ్జాకు గురైన పార్కుల సంగతి దేవుడెరుగు. కనీసం ఉన్న వాటిని కాపాడాలని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.


వందకు పైగా అక్రమ లే అవుట్లే...

కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సుమారు 300లకు పైగా లే అవుట్ కాలనీలు ఉన్నాయి. వీటిలో 200ల వరకు బోర్డు ద్వారా గుర్తింపు పొందగా, మిగితావి అక్రమ లే అవుట్లు, వీటిల్లో నిర్మాణాలు చేపట్టేందుకు రకరకాల సాకులు చూపి బోర్డు నుంచి అనుమతి పొందినవారు కొందరైతే.. మరికొందరు నేతలు, బాడా బాబుల అండదండలతో అనుమతులు లేకుండానే ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే అనుమతి పొందిన లే అవుట్లలో బోర్డుకు చెందిన పార్కు స్థలాలుగా చూపించిన వాటిలో సైతం బహుళ అంతస్థుల నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి.

ఓపెన్ ప్లాట్ల పేరిట

అక్రమ లే అవుట్లలోని ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టడానికి అబిటింగ్ రోడ్డు, ఓపెన్ ప్లాట్ల నెపంతో బోర్డు నుంచి అనుమతులు పొంది వాటిల్లో బహుళ అంతస్థులను నిర్మించిన ఉదంతలు ఉన్నాయి. అనుమతులేని లే అవుట్ లో ఇంటిని నిర్మించడానికి సదరు యజమాని స్థానిక నేతలతోపాటు బోర్డు కార్యాలయం, దాని అనుబంధ కార్యాలయాల్లో విధులు నిర్వహించే కిందిస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారి వరకుచేతులు తడిపితే పనులు సులువన్న ఆరోపణలు ఉన్నాయి. బోయిన్ పల్లి, తాడ్ బండ్, కార్ఖానా, మహేంద్ర హిల్స్, బొల్లారం, లాల్ బజార్, తిరుమలగిరి, పికెట్, రసూల్ పూర, బలంరాయి, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

రివైజ్డ్ లే అవుట్ల పేరుతో..

బోర్డు పరిధిలో అనుమతులు పొందిన లే అవుట్లలో కూడా చాలా వరకు అవకతవకలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. మొదట బోర్డు నుంచి అనుమతి పొందన లే అవుట్ లో మార్పులు చేశామంటూ రివైజ్డ్ లే అవుట్ల పేరిట బోర్డు నుంచి రెండోసారి అనుమతులు పొందిన కాలనీలు ఉన్నాయి. అయితే, ఈ రివైజ్డ్ లే అవుట్లలో మొదటి లే అవుట్ లో బోర్డుకు చెందిన పార్కు స్థలంగా చూపించిన స్థలాన్ని ప్లాట్లుగాను, ప్లాట్లుగా చూపించిన వాటిని పార్కులుగా చూపించి ప్లాట్లను విక్రయించడమే కాకుండా బోర్డుకు చెందాల్సిన 40 శాతం స్థలాలను కనుమరుగు చేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆరవ వార్డు పరిధిలోని మారుతీ నగర్(రాంగోపాల్ పేట ఎన్ క్లేవ్), పద్మనాభ ఎన్ క్లేవ్ లోని లే అవుట్ లో పార్కు స్థలాన్ని రివైజ్డ్ లే అవుట్ లో ప్లాట్ గా చూపించి భవన నిర్మాణం చేపడుతుండడం గమనార్హం. ఈ వ్యవహారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారంపై ఎవరిని కదిపినా తేలు కుట్టిన దొంగల్లా తనకు తెలయదంటే తనకు తెలియదని దాట వేస్తుండడం శోచనీయం.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

శివారు మున్సిపాలిటీలు, పంచాయితీల పరిధిల్లోని అక్రమ లే అవుట్లను చేసిన రియల్టర్లపై హెచ్ఎండీఏ, రాష్ట్ర సర్కారు కొరడా ఝుళిపిస్తున్న ప్రస్తుత తరుణంలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు మాత్రం అక్రమ లే అవుట్లు, అందులోని పార్కుల కబ్జాలపై చర్యలు తీసుకునే విషయంలో నీమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన చర్యలనే బోర్డు ఉన్నతాధికారులు కూడా అవలంభిస్తే బోర్డు పరిధిలోని రూ. కోట్ల విలువ జేసే స్థలాలను స్వాధీన పరచుకోవచ్చు.

గతంలో సర్వే..

కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని లే అవుట్లలో బోర్డుకు చెందిన 40 శాతం స్థలాలను స్వాధీన పరుచుకునేందుకు గాను సర్వే నిర్వహించారు. గతంలో ఇక్కడ సీఈఓగా పనిచేసిన బాలక్రిష్ణ ప్రత్యేక దృష్టి సారించి 100 ప్లాట్లను గుర్తించడమే కాకుండా వాటికి సంబంధించిన పూర్తి నివేదికను పూణెలోని ఉన్నతాదికారులకు పంపించారు. దీనికి కొత్తగా చేపట్టే నిర్మాణాలపై ఉక్కు పాదం మోపారు. అనుమతులను కూడా తిరస్కరించారు. ఆ తర్వాత వచ్చిన సీఈఓలు 40 శాతం పార్కు స్థలాలపై దృష్టి సారించలేదు. దీంతో పార్కు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా బోర్డు ఉన్నతాధికారులు పార్కు స్థలాల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పార్కు స్థలాలను కాపాడుకుంటాం: జె.రామక్రిష్ణ, బోర్డు నామినేటేడ్ సభ్యుడు

పార్కు స్థలాలను కబ్జా చేస్తే ఊపేక్షించం. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. తిరిగి వాటిని స్వాధీనం చేసుకుంటాం.. కాకపోతే పార్కు స్థలాలు కబ్జాకు గురైనట్లు తన దృష్టికి రాలేదు. ఎవరైనా నిర్దిష్టింగా ఫిర్యాదు చేస్తే.. సంబంధిత అధికారులతో విచారణ జరిపిస్తాం.. కంటోన్మెంట్ పౌరులకు అహ్లాదకర వాతావారణాన్ని కల్పించేందుకు పార్కులు ఎంతగానో దోహదపడుతాయి.

Tags:    

Similar News