సుచిత్ర శ్రీ చైతన్య పాఠశాలకు షోకాజ్ నోటీసులు

విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడిచినప్పటికీ స్కూల్ నిర్వహణ

Update: 2024-06-26 13:30 GMT

దిశ,పేట్ బషీరాబాద్: విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడిచినప్పటికీ స్కూల్ నిర్వహణ కోసం ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సుచిత్ర శ్రీ చైతన్య పాఠశాలకు కుత్బుల్లాపూర్ ఎంఈఓ వసంతకుమారి షోకాజ్ నోటీసులు అందజేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ దుర్గా ఎస్టేట్ మూడు గుండ్ల ఎదురుగా శ్రీ చైతన్య పేరిట అనుమతులు లేకుండా పాఠశాల ను ఏర్పాటు చేశారు. దీంతో కుత్బుల్లాపూర్ ఎంఈఓ వసంతకుమారి పాఠశాలను అధికారికంగా సీజ్ చేశారు. అయినప్పటికీ శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకులు ఎంఈఓ ఆదేశాలను ఖాతరు చేయకుండా అడ్మిషన్లు తీసుకుంటూ వచ్చారు. బుధవారం శ్రీ చైతన్య పాఠశాల ప్రారంభమవుతుందని తెలుసుకున్న ఎంఈఓ పాఠశాలకు వచ్చి మూడోసారి షోకాజ్ నోటీసులు అందజేశారు. అనుమతులు తెచ్చుకోవడానికి తమకు 15 రోజులు గడువు ఇవ్వాల్సిందిగా శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకులు ఎంఈఓ ను కోరగా మూడు రోజులు మాత్రమే గడువు అంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది.

ఎన్ఎస్‌యు‌ఐ అభ్యంతరం..

సుచిత్ర శ్రీ చైతన్య పాఠశాలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి వచ్చిన ఎంఈఓ వసంతకుమారి, ఎంఎల్ఓ రమేష్ లకు అభ్యంతరం తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాలకు పక్కనే ఉన్న మరొక పాఠశాలకు ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో చెప్పాలని, ఆ స్కూల్ కి నోటీసులు ఇచ్చిన తర్వాతనే చైతన్య స్కూలుకు నోటీసులు ఇవ్వాలని కొద్దిసేపు భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయంపై కచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలకు అన్నింటికీ నోటీసులు ఇస్తామని ఎంఎల్ఓ రమేష్ స్పష్టంగా తెలియజేస్తూ శ్రీ చైతన్య నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

అన్నింటిపై చర్యలు తీసుకోవాలి : ఎన్ఎస్‌యు‌ఐ విద్యార్థి సంఘం

శ్రీ చైతన్య పాఠశాల పక్కనే ఉన్న సెయింట్ ఆంథోనీ పాఠశాలను ఎంఈఓ వసంతకుమారి పరిశీలించారు. ఈ సందర్భంలో ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అన్ని పాఠశాలలకు చట్టపరంగా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమకు ఈ పాఠశాల ఆ పాఠశాల అనే భేదభావం లేదని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు.

మరోసారి ధర్నా..

అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహణ చేస్తున్న సుచిత్ర శ్రీ చైతన్య పాఠశాల ముందు బుధవారం బడ్జెట్ పాఠశాల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు మరోసారి ధర్నా చేశారు. అనుమతులు లేకుండా ఏ విధంగా 300 కు పైగా విద్యార్థులను అడ్మిషన్ తీసుకొని తరగతులు నిర్వహిస్తారు అని మండిపడ్డారు. శ్రీ చైతన్య పాఠశాల పై విద్యాశాఖ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం : ఎంఈఓ వసంతకుమారి

ఈ విషయంపై కుత్బుల్లాపూర్ ఎంఈఓ వసంతకుమారి మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలకు ఇప్పటికే మూడు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఈ పాఠశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకోవడమే కాకుండా, సీజ్ చేసిన పాఠశాలను తెరవడం పై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Similar News