కంటోన్మెంట్ విలీనానికి గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఎట్టకేలకు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ప్రాంతాలు జీహెచ్ఎంసీ లోకి

Update: 2024-06-29 13:24 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: ఎట్టకేలకు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ప్రాంతాలు జీహెచ్ఎంసీ లోకి విలీనం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈనెల 27న ఢిల్లీలో జరిగిన సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోవడం 28న దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడటం జరిగాయి. దీంతో ఇకపై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు జీహెచ్ఎంసీ లోకి రావడంతో పాటుగా వాటి అభివృద్ధి పనులు కూడా ఇకపై జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఢిల్లీలో జరిగిన కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫునుంచి సి ఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ ధన కిషోర్ లు పాల్గొన్నారు.

ఆస్తులు.. అప్పులు అన్ని అప్పగింత..

ఇప్పటివరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అన్ని రకాల ఆస్తులను జిహెచ్ఎంసి కు స్వాధీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. అదేవిధంగా ఉన్న అప్పులను కూడా తీర్చే బాధ్యత జిహెచ్ఎంసి యే తీసుకోనుంది. లీజుకిచ్చినవి ఓల్డ్ గ్రాంట్ బంగళాలను సైతం జిహెచ్ఎంసి నే పర్యవేక్షించనున్నది. బోర్డు పరిధిలో ఉన్న అన్ని రకాల ఆస్తులను ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ అప్పగించనున్నది. దీంతో అత్యంత విలువైన ఆస్తులు భూములు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి.

దశాబ్దాల చరిత్ర కలిగిన కంటోన్మెంట్..

బ్రిటిష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో పలు ప్రాంతాల్లో వారి ఆర్మీ స్థావరాలను ఏర్పాటు చేసింది . స్వాతంత్రం వచ్చిన అనంతరం వాటిని రక్షణ విభాగం ఆధీనంలో ఉంచుకొని ఆ ప్రాంతాలను కంటోన్మెంట్ బోర్డు పేరుతో అభివృద్ధి చేసింది. మూడు లక్షల పైగా జనాభా కలిగి ఉన్న కంటోన్మెంట్ బోర్డు పరిధి దాదాపుగా 40 స్క్వేర్ కిలోమీటర్ల రేంజ్ లో విస్తరించి ఉంది. బోర్డు పరిధిలో ఇప్పటివరకు 13 గ్రామాలు, 279 ప్రైవేట్ హౌసింగ్ కాలనీలు, 16 సివిల్ ఏరియాలో ఉన్నాయి.

Similar News