కూకట్‌పల్లిలో కీలకంగా మారనున్న సెటిలర్ల ఓట్లు..
ఎన్నికల సమీపిస్తున్న వేళ కూకట్పల్లి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
దిశ,కూకట్పల్లి : ఎన్నికల సమీపిస్తున్న వేళ కూకట్పల్లి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖ పోటీ ఉండనుందనే చెప్పవచ్చు. తెలంగాణ వచ్చిన తరువాత ఈ సారి నియోజకవర్గంలోని సీమాంధ్ర ప్రాంత ఓట్లకు భలే డిమాండ్ పెరిగింది. టీడీపీ, నారా చంద్రబాబు నాయుడు అభిమానులు, వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి అభిమానులు, జనసేన, పవన్ కల్యాణ్ అభిమానులు ఇలా ఓటర్లను అన్ని పార్టీల నాయకులు పంచుకుంటున్నారు. కూకట్పల్లి ఎన్నికలు చూస్తుంటే ఎన్నికలు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నట్టు ఉంది. పోటీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలకు ఏ కులం ఓట్లు అధికంగా పడతాయి, ఏ వర్గం వారు మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు కూకట్‌పల్లిలో ఎక్కడ చూసిన ఇదే చర్చ జరుగుతుంది.
కూకట్పల్లి బరిలో జనసేన..
కూకట్‌పల్లిలో ఇన్ని రోజులు సస్పెన్స్‌కు తెర పడింది. ఎన్నికలలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా ఏ పార్టీకి టికెట్ కెటాయిస్తారో అని అటు బిజేపీ, ఇటు జనసేన నాయకులు వేచి చూస్తున్న క్రమంలో బీజేపీ, జనసేన పార్టీల అధిష్టానం జనసేనకు టికెట్ కెటాయిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కూకట్‌పల్లిలో ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉన్న పోటీ ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. నియోజకవర్గంలో 70 వేల వరకు కాపుల ఓటు, కూకట్‌పల్లిలో 30 శాతం ఉన్న బీసీ జాబితా నుంచి తొలగించిన 27 బీసీ కులాల ఓట్లు జనసేనకు ఫెచ్చింగ్ అవుతాయని జనసేన నాయకులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని కూకట్పల్లి నుంచి జనసేన పోటీ చేసేందుకు ముందుకు వచ్చినట్టు చర్చ జరుగుతుంది. కూకట్పల్లి జనసేన అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఖరారు అవడంతో కూకట్‌పల్లిలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా తలకిందులు అయ్యాయనే చెప్పవచ్చు.
ఎవరికి ఎవరు అండగా:.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ సందర్భంగా జరిగిన అందోళన కార్యక్రమాలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు, టీడీపీ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం వారు బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వారి ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన బండి రమేష్‌ను బరిలో దించారు. దానికి తోడు మైనారిటిలు, దళితుల ఓట్లు, దానికి తోడు తెలంగాణ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం ఓట్లు సైతం కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తుంది. కాపు సామాజిక వర్గంతో పాటు తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 27 బీసీ కులాల ఓట్లు కూకట్‌పల్లిలో ఎక్కవ శాతం ప్రభావం చూపిస్తాయనే చెప్పవచ్చు, ఈ ఓట్లు జనసేన, కాంగ్రెస్ పార్టీల వైపుకు మళ్లడం, అదే విధంగా బీజేపీ ఓటు బ్యాంకు కలిసి జనసేనా పార్టీ సైతం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. జనసేన పార్టీ అభ్యర్థి కాపు సామాజిక వర్గానికి చెందిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు సుపరిచుతుడు కావడంతో కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది.
బీఆర్ఎస్ అభ్యర్థికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు..
కూకట్‌పల్లిలో ఒక్క సారిగా మారిన రాజకీయాలు బీఆర్ఎస్ అభ్యర్థికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబం నుంచి నందమూరి సుహాసినిని బరిలో దించారు. ఎన్నికలలో సుహాసిని 70471 ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చింది. ఈ సారి బీజేపీ, జనసేన పొత్తులో కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దించడం, కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దించడంతో రాజకీయాలు పూర్తిగా మారి పోయాయి. నియోజకవర్గంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై వ్యతిరేకత రావడంతో పాటు కొన్ని డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత సైతం ఈ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. నియోజకవర్గంలో తొలగించిన బీసీ కులాలు, శ్రీకాకూళం ఓట్లు, దళిత బంధు, మైనారిటి బంధు, బీసీ బంధు పథకాలు అందరికి అందక పోవడంతో మైనారిటీలు, దళితులు ఎటు వైపు మొగ్గు చూపుతారో చెప్పలేని పరిస్థతి ఉంది. బీసీ ఐక్యకార్యచరణ సమితి నాయకుడు, బీఆర్ఎస్ నాయకులు బాశెట్టి నర్సింగరావు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేయడంతో బీఆర్ఎస్లోనే వ్యతిరేకత ఉన్నట్టు బయట పడుతుంది.