ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలి

ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది.

Update: 2024-10-09 14:38 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ పిలుపు మేరకు బుధవారం మేడ్చల్ జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. తూంకుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వెళ్లి అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పంగ ప్రణయ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశపగా రాంచందర్ మాదిగ హాజరై మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మంద కృష్ణమాదిగ నేతృత్వంలో మూడు దశాబ్ధాలుగా రాజీలేని పోరాటం చేస్తున్నామని వివరించారు. ఆ పోరాట ఫలితంగానే ఆగష్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందన్నారు.

    ఈ తీర్పు ద్వారా ముప్ఫై ఏళ్ల పోరాటానికి న్యాయమైన పరిష్కారం లభించిందని తెలిపారు. అయితే ఈ తీర్పు వచ్చిన అర్ధగంటలోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, దేశంలో వర్గీకరణను అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నారని పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగేలా చూస్తామని, అందుకు అవసరమైతే ఆర్డినెన్సు తీసుకువస్తామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటికే రెండు నెలలు గడిచినా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురాలేదన్నారు. ఎంఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి , రాష్ట్ర కార్యదర్శి భైరపోగు శివకుమార్ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత కూడా గత రెండు నెలలుగా విద్యారంగానికి సంబంధించి జరిగిన అన్ని కోర్సుల అడ్మిషన్లలో మాదిగ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.

    మరో వైపు ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను మరిచిపోయి డీఎస్సీ ద్వారా 11062 ఉద్యోగాలను భర్తీ చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ డీఎస్సీలో ఉద్యోగాల మీద ఎంతో ఆశ పెట్టుకొని ఎదురుచూసిన మాదిగ నిరుద్యోగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ అవుతున్న 11 వేల టీచర్ నియామకాల్లో మాదిగలకు భారీ నష్టం జరిగిందన్నారు. డిసెంబర్ లోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఎస్సీ వర్గీకరణ లేకుండా లక్ష ఉద్యోగాలు భర్తీ అయితే మాదిగ జాతికి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక ఎంతో వెనుకబడిపోయామని, తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి అన్యాయం చేయడం సరైంది కాదన్నారు.

    ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే వేగవంతంగా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు ఉద్యోగ నియామకాలు పూర్తిగా నిలిపివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ సీనియర్ నాయకులు బంగారిగాళ్ల శంకర్ మాదిగ , బచ్చలికూర స్వామి మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శివ మాదిగ, యువసేన అధ్యక్షుడు డాబిల్పురం పరుశురామ్, మహిళా విభాగం అధ్యక్షురాలు సలోమి మాదిగ, కళామండలి నాయకులు గజ్జెల రాంచందర్ , ఆదర్శపల్లి శేఖర్, చిన్నస్వామి, ఎమ్మెస్పీ నాయకులు రసమల్ల యాదగిరి, నరేందర్, రమేష్ బాబు,ఏనూతుల నగేష్, కుండా భానుచందర్, నరేందర్, నాగులాపల్లి కేశవ్, తోకట నరేష్,ఎమ్మార్పీఎస్ కార్యదర్శి భీష్మ, రమేష్, బండారి సాయి, గద్దల రవి, కొత్త నరేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News