పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి: జోనల్​ కమిషనర్​ మమత

కూకట్​పల్లి జోన్​ పరిధిలో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జోనల్​ కమిషనర్​ మమత అన్నారు.

Update: 2023-03-01 14:53 GMT

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి జోన్​ పరిధిలో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని జోనల్​ కమిషనర్​ మమత అన్నారు. జోనల్​ కార్యాలయంలో బుధవారం జోన్​ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి స్వచ్ఛ సర్వేక్షణ్ 2023పై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​తో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జోనల్​ కమిషనర్​ మమత మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 జీహెచ్ఎంసీకి మంచి ర్యాంకు సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. మొత్తం 1750మార్కులు ఉంటాయని, ఇందులో ముఖ్యంగా తడి చెత్తను, పొడి చెత్తగా వేరు సేకరణకు 300 మార్కులు, చెత్త రిక్షాలలో ఇంటి వద్ద నుంచి తడి పొడి చెత్తను వేరు వేసి సేకరించడంకు 150 మార్కులు, పారిశుధ్య కార్మికుల పనితనానికి 100 మార్కులు, పారిశుధ్య కార్మికుల నైపుణ్యతకు 100 మార్కులు, చెత్త నుంచి వండర్​ పార్కుకు 100 మార్కులు, జీరో వేస్ట్​ ఈవెంట్స్​, పెండ్లీలు, మతపరమైన పండుగలకు 90 మార్కులు ఉంటాయని అదే విధంగా స్వచ్ఛ ఆటోలు రెండు కంపార్టుమెంట్​లు, పైకప్పు ఉండేలా చేసుకోవాలని జోనల్​ కమిషన్​ తెలిపారు.

నాలాలో చెత్త వేయకుండా చర్యలు, పైకప్పు ఏర్పాట్లు, జాలీలు ఏర్పాటు చేయాలని, చెరువులు, కుంటలలలో చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాల నుంచి వచ్చే పువ్వుల నుంచి వస్తువులు తయారు చేయడం, వేస్ట్​ మేనేజ్​మెంట్​పై అవగాహన కల్పించాలని, చెట్ల ద్వారా వచ్చే వ్యర్థాల నుంచి ఎరువులు తయారు చేయడం, నిర్మాణ వ్యర్థాలను భవన నిర్మాణాలలో వినియోగించడం అనే అంశాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛ ఆటోలకు పైకప్పు తప్పకుండా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, జోన్​ పరిధిలోని అన్ని సర్కిళ్లలో స్వచ్ఛ సర్వేక్షన్​ 2023 పక్క అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జోనల్​ కమిషనర్​ మమత సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీలు రవి కుమార్​, రవీందర్​ కుమార్, ప్రశాంతి, అన్ని సర్కిళ్ల పారిశుధ్య విభాగం అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News