అలియాబాద్ డైమండ్ కేఫ్ లో కుళ్లిపోయిన బిర్యానీ.. ఆందోళన చేసిన బాధితులు
హైదరాబాద్ నగరంలో బిర్యానీ అంటే ఎంత ప్రసిద్ధిగాంచిందో అందరికి తెలిసిందే. నిత్యం బిర్యానీ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు
దిశ, శామీర్ పేట: హైదరాబాద్ నగరంలో బిర్యానీ అంటే ఎంత ప్రసిద్ధిగాంచిందో అందరికి తెలిసిందే. నిత్యం బిర్యానీ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు భోజన ప్రియులు. బిర్యానీ హోటల్స్ కు దందా పెరగడంతో ఇంకా ఎక్కువగా డబ్బులు ఆశించి మూడు రోజుల క్రితం మిగిలిపోయిన బిర్యానీని కూడా తాజాగా చేసిన బిర్యానీలో కలిపేసి విక్రయిస్తూ ఉంటారు. అలాంటి సంఘటనే మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని అలియాబాద్ చౌరస్తాలో ఉన్న డైమాండ్ కేఫ్ లో జరిగింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఉన్న పిల్లల కోసం డైమండ్ కేఫ్ లో బిర్యానీ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాక తినడానికి పార్సెల్ ఓపెన్ చేసి చూడగా కుళ్లిపోయినా మాంసం దుర్వాసన రావడంతో కొనుగోలు చేసిన హోటల్ కి వెళ్లి ఇదేంటి అని ప్రశ్నిస్తే హోటల్ యాజమాన్యం భాధితులతో గొడవకు దిగి అసభ్య పదజాలంతో దుషిస్తూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని అనడంతో హోటల్ ముందు ఆందోళనకు దిగారు భాధితులు.
నాణ్యత లోపించిన బిర్యానీని విక్రయించడమే కాకుండా, హోటల్ పరిసర ప్రాంతం కూడా అపరిశుభ్రంగా ఉంచుతూ స్థానికులకు దుర్వాసన వెదజల్లుతున్నారు. నాణ్యత లోపించిన ఆహారాన్ని విక్రయిస్తున్న హోటల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు నెలకు ఒకసారైనా సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.