'చెరువును రెండుగా చీల్చిస్తున్నారు'.. రియల్టర్ల బరితెగింపు..

చెరువును రెండుగా చీల్చిస్తున్నారు.. చెరువు మధ్యలో రోడ్డు వేస్తున్నారు.. దశాబ్దాలుగా ప్రజలకు సాగు, తాగు నీళ్లు అందించిన చెరువులు కబ్జా కోరల్లో పడి ఛిద్రం అవుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోతుంది.

Update: 2023-08-26 13:56 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: చెరువును రెండుగా చీల్చిస్తున్నారు.. చెరువు మధ్యలో రోడ్డు వేస్తున్నారు.. దశాబ్దాలుగా ప్రజలకు సాగు, తాగు నీళ్లు అందించిన చెరువులు కబ్జా కోరల్లో పడి ఛిద్రం అవుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోతుంది. రియల్టర్ల కబంద హస్తాల కింద ఘట్ కేసర్‌లోని సెటైరు కుంట చెరువు కనుమరుగవుతుంది. కబ్జా కోరులు చెరువును రెండుగా చీల్చి.. మధ్యలో రోడ్డు వేస్తున్నా.. సర్కారు యంత్రాంగం మొద్దు నిద్ర వీడటంలేదన్న విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.

సెటైరుకుంట మాయం..

ఘట్ కేసర్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్లు 290,291, 292 లలో 10 ఎకరాల విస్తీర్ణంలో సెటైరు కుంట చెరువు ఉండేది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం.. రియల్టర్ల భూ దాహంతో రోజు రోజుకు కరిగిపోతుంది. ఇప్పటికే దాదాపు 6 ఎకరాలు కబ్జాకు గురైందని చెబుతున్న సంబంధిత అధికారులు.. మిగిలి ఉన్న చెరువును కాపాడడంలోనూ విఫలం అవుతున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


ఘట్ కేసర్ మండల కేంద్రంలో రోడ్డును అనుకోని నిండు కుండలా ఉన్న చెరువును.. అక్రమార్కులు చెరువును రెండు విభాగాలు విభజించారు. రాత్రికి రాత్రే వందల మట్టితో నింపి.. చెరువు మధ్యలో రోడ్డు వేశారు.. నలువైపుల నుంచి.. మట్టితో రాళ్లతో పూడ్చివేశారు.

అయినా రోడ్డు వేసేశారు..

చెరువు కబ్జా విషయమై ‘దిశ’ దినపత్రిక ఆగస్టు 5వ తేదీన ‘రికార్డుల్లో 10.. ప్రస్తుతం 4 ఎకరాలే..! అనే కథనాన్ని ప్రచురించింది. రోడ్డు కోసం అధికార పార్టీకి చెందిన ఓ రియల్టరు చెరువులో మట్టి వేస్తున్న దృశ్యాలతో వెలుగులోకి తెచ్చింది. చెరువు అవతల ఓ భారీ అపార్ట్ మెంట్‌ను నిర్మించేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నేత మట్టిని పోస్తున్నారని, చెరువు కబ్జా అవుతున్న విషయమై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని కథనాన్ని దిశ ప్రచురించింది.


అయినా అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహారించడంతో రోడ్డును రియల్టర్లు పూర్తి చేశారు. ఈ వ్యవహారంలో అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్లనే అధికారులు చెరువును కబ్జా చేసి రోడ్డును వేసినా.. రియల్టర్‌కు అండగా నిలబడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం.. పరమేష్ (ఏఈ నీటి పారుదల శాఖ)

సెటైరు కుంట చెరువు కబ్జా అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చింది.. గతంలో చెరువు మధ్యలో రోడ్డు వేయడాన్ని అడ్డుకున్నాం. చెరువులో రోడ్డు పనులను నిలిపివేయాలని మున్సిపల్ కమీషనర్‌కు కూడా పిర్యాదు చేశాం. అయితే మరోసారి సోమవారం ఫిర్యాదు చేయబోతున్నాం.. అవసరమైతే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా చర్యలకు కూడా వెనుకబోం.


Similar News