పని వేళల్లో మార్పు చేయొద్దంటూ పారిశుధ్య కార్మికుల ధర్నా...
పని వేళల్లో మార్పు చేయొద్దంటూ ఘట్కేసర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు బుధవారం దాదాపు 100 మంది కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు.
దిశ, ఘట్కేసర్ : పని వేళల్లో మార్పు చేయొద్దంటూ ఘట్కేసర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు బుధవారం దాదాపు 100 మంది కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ పరిధిలో 8 గంటలపాటు విధులు నిర్వహిస్తుంటామని, ఇప్పుడు కావాలని తమను ఇబ్బందులకు గురి చేసేందుకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పూటలా పనిచేయించాలని ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదని కార్మికులు వాపోయారు. డ్రైనేజీ, చెత్త ఏరివేయడం పనులు చేస్తున్న తమను చిన్నచూపు చూస్తూ వేధింపులకు గురిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ధర్నా కొనసాగిస్తామని చెప్పారు. అయితే ఈ వేళల్లో పారిశుధ్య కార్మికులు సకాలంలో విధులకు హాజరు కాకపోవడం, ఒక గంట ముందుగానే విధులు ముగించుకొని వెళ్ళిపోతున్నారని ఫిర్యాదులు అందడంతో.. పారిశుద్ధ్య కార్మికులు ఉదయం, సాయంకాలం వేళల్లో ఎనిమిది గంటల పాటు పనిచేయాల్సి ఉంటుందని ఇటీవల కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ తెలిపారు. ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా అతి తక్కువ జీతంతో పారిశుద్ధ్య కార్మికులు ఉదయం, మధ్యాహ్నం వేళలో రెండుపూటల విధులు నిర్వహిస్తున్నారని, ఇదే పద్ధతిని పట్టణ కేంద్రంలో కొనసాగించేందుకు కమిషనర్ సాబీర్ అలీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.