మంత్రులు వస్తే కాని చెక్కులు ఇవ్వరా : ఎమ్మెల్యే మాధవరం..
కూకట్పల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేయకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని, సంక్షేమ పథకాలకు అధికార పార్టీ రాజకీయ గ్రహణం పట్టిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.
దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేయకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని, సంక్షేమ పథకాలకు అధికార పార్టీ రాజకీయ గ్రహణం పట్టిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కూకట్పల్లిలో మంత్రి వస్తే తప్ప లబ్దిదారులకు చెక్కులు ఇవ్వడం లేదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అధికార పార్టీ నాయకుల గ్రహణం పట్టి పీడిస్తుందని ఆరోపించారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్పల్లి, బాలానగర్ మండల కార్యాలయాలకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు వచ్చి రోజులు గడుస్తున్నా మంత్రి సమయం ఇవ్వడం లేదు, మంత్రి అపాయింట్మెంట్ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని అన్నారు.
నియోజకవర్గం పరిధికి చెందిన 534 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు తహశీల్దార్ కార్యాలయానికి చేరి నెలలు గడుస్తున్న పంపిణి చేయక పోవడంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చెక్కులు పంపిణీ చేయమని ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లను కోరిన జిల్లా ఇన్చార్జి మంత్రి సమయం ఇవ్వడం లేదని దాటవేస్తున్నారని అన్నారు. పేద ప్రజలు ఎంతో కష్టపడి అప్పులు చేసి తమ బిడ్డల పెండ్లిలు చేసుకున్న వారు చెక్కుల కోసం పడిగాపులు గాస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదింటి ఆడబిడ్డల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలు, రాజకీయాలకు తావు లేకుండా గడిచిన పదేండ్లలో ప్రభుత్వ పథకాలు అందరికి అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో గత పదేండ్లు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సైతం పండుగల నిర్వహించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇస్తున్న దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఉన్న చెక్కులు కూడా లబ్దిదారులు అందించకుండా రాజకీయం చేస్తున్నారని అన్నారు. గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. లబ్దిదారులు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే చెక్కులు ఎమ్మెల్యే వద్ద పెండింగ్లో ఉన్నాయని ఊపిస్తుండటంతో లబ్దిదారులు ఎమ్మెల్యే కార్యాలయం చుట్టు తిరుగుతున్నారని అన్నారు. మంగళవారం 11 గంటల వరకు చెక్కులు పంపిణి చేయకపోతే తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. లబ్దిదారులకు చెక్కులు అందించే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి పంపిణీ చేసే వరకు ఉద్యమం చేస్తామని అన్నారు.