నిబంధనలు ప్రజలకేనా.... పోలీసులకు కాదా...
రాజ్యాంగం ద్వారా పుట్టిన చట్టాలు కేవలం సామాన్య ప్రజలే పాటించాలా, చట్టంలోని వారికి చట్టాలు, నిబంధనలు చుట్టాలేనా..?
దిశ, కూకట్పల్లి : రాజ్యాంగం ద్వారా పుట్టిన చట్టాలు కేవలం సామాన్య ప్రజలే పాటించాలా, చట్టంలోని వారికి చట్టాలు, నిబంధనలు చుట్టాలేనా..? అధికారులు నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదా...? కూకట్పల్లి జాతీయ రహదారి పై నిబంధనలకు విరుద్ధంగా భారి రాళ్లతో ప్రయాణిస్తున్నాయంటు గురువారం అర్ధరాత్రి కూకట్పల్లి పోలీసులు నాలుగు టిప్పర్లను పట్టుకున్నారు.
ఇదిలా ఉంటే నిబంధనలు పాటించని టిప్పర్లను పట్టుకున్న పోలీసులు వాళ్లు పట్టుకున్న టిప్పర్లను ఏకంగా వేలాది మంది విద్యనభ్యసిస్తున్న ప్రభుత్వ డిగ్రి కళాశాల ప్రధాన గేటుకు ఎదురుగా, వందలాది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు నిలిచి ఉండే బస్టాప్‌కు అడ్డంగా నిలిపారు. అంతే కాకుండా జాతీయ రహదారి పై ఫుట్ పాత్ పొడవున ఏకంగా నాలుగు భారి టిప్పర్లను పార్క్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అత్యధిక ట్రాఫిక్, రద్ది ప్రాంతంగా కూకట్పల్లి పేరు గాంచింది. ఎంతో రద్దిగా ఉండే కూకట్పల్లి జాతీయ రహదారి పొడవున భారి టిప్పర్లు అందులోని భారి బండరాళ్లు ప్రమాదకరంగా కనిపిస్తు ప్రయాణికులు, బాటసారులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి.