స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల నుంచి యువత స్ఫూర్తి పొందాలి: Governor

హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ బుధవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో...Photo Exhibition at Secunderabad Parade Ground

Update: 2022-09-14 10:18 GMT

దిశ, కంటోన్మెంట్: హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ బుధవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ విమోచన వారోత్సవాలను సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అధికారికంగా ఏడాది పాటు 2023 సెప్టెంబర్ 17 వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో కలిసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు ఫొటో ఎగ్జిబిషన్‌ ను ఏర్పాటు చేశాయి.

ఎగ్జిబిషన్‌ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన గవర్నర్, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందాలని సూచించారు. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన హైదరాబాద్ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 నిజమైన విమోచన దినం అని గవర్నర్ అన్నారు. పరకాల, బైరంపల్లి ఘటనలను గవర్నర్ గుర్తు చేశారు. పరకాల ఊచకోతలో 30 మందిని కాల్చి చంపారని అన్నారు. బైరంపల్లిలో రజాకార్లు 90 మందికి పైగా అమాయకులను బావిలోకి తోసి వేశారని గవర్నర్ వివరించారు. హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కల్పించి రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు ఉక్కు మనిషిగా గుర్తింపు పొందిన అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ ఆపరేషన్ పోలో కార్యక్రమాన్ని చేపట్టారని గవర్నర్ తెలిపారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.

హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులపై ఫొటో ఎగ్జిబిషన్‌ ను ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ)ని గవర్నర్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా నేటి యువతకు నాటి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు, సాగించిన పోరాటాలు తెలుస్తాయని అన్నారు. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన స్వాతంత్య్ర సమరయోధులు వల్ల నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) డైరెక్టర్ జనరల్ (సౌత్) ఎస్. వెంకటేశ్వర్ అప్పటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధులు పోషించిన పాత్ర గుర్తుకు తెచ్చేలా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామని వివరించారు. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, వందేమాతరం రామచంద్రరావు, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి వంటి స్వాతంత్య్ర సమరయోధులు సాగించిన పోరాటాన్ని వివరిస్తూ మొత్తం 60 ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు. అంతకుముందు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రమణారెడ్డిని, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను గవర్నర్ సన్మానించారు. సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి మాట్లాడారు. వేదిక వద్ద పబ్లికేషన్స్ విభాగం ఒక పుస్తక ప్రదర్శన మరియు లలిత కళా అకాడమీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని చిత్రించే పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది.

Also Read: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ గవర్నర్  

Tags:    

Similar News