ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించే విధంగా మమేకమై పనిచేయాలి : డీసీపీ

సమాజంలో నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం పోలీస్ వ్యవస్థకు

Update: 2024-06-26 15:54 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : సమాజంలో నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం పోలీస్ వ్యవస్థకు ఎంతో అవసరమని బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు. బాలానగర్ జోన్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ను డీసీపీ సురేష్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన అనంతరం స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడారు. ప్రజల మాన, ప్రాణాల రక్షణకు పోలీసు సేవలు సమాజానికి అండగా నిలుస్తాయని డీసీపీ తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం పోలీస్ వ్యవస్థకు ఎంతో అవసరం ఉందని అన్నారు. ప్రతి సిబ్బంది స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు బాధితులతో,స్నేహభావంతో మర్యాదపూర్వకంగా మెదులు కోవాలన్నారు.

చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేరాలు అదుపు చేసేందుకు కృషి చేయాలన్నారు. సమాజంలో పోలీస్ శాఖ విధి నిర్వహణ ఎంతో కీలకమైందని డీసీపీ సురేష్ స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించే విధంగా మమేకమై పనిచేయాలన్నారు. అనంతరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ క్రాంతి, ఎస్ఐలు తదితరులతో మాట్లాడిన డీసీపీ జగద్గిరిగుట్ట ప్రాంతంలో అనునిత్యం గస్తీ నిర్వహిస్తూ, వాహనాల తనిఖీలు చేపడుతూ, నిర్మానుష్య ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం సేవించే వారిపై, గంజాయి ముఠాలు, మందు బాబుల బెడద లేకుండా విజబుల్ పోలింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు లేనిచోట కొత్తవి ఏర్పాటు చేయాలని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ జగద్గిరిగుట్ట ఎస్ హెచ్ ఓ ను ఆదేశించారు.

Similar News