వందే భారత్ రైలును పదిసార్లు ప్రారంభించడం మోడీకే చెల్లుతుంది: ఎమ్మెల్సీ పల్లా
వందే భారత్ రైలును పది సార్లు ప్రారంభించడం మోదీకే చెల్లుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
దిశ, కూకట్పల్లి: వందే భారత్ రైలును పది సార్లు ప్రారంభించడం మోడీకే చెల్లుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఫతేనగర్ తెలంగాణ గార్డెన్స్‌లో ఆదివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఫతేనగర్, బాలానగర్ డివిజన్ల బూత్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేయని పనులను తామే చేశామని చెప్పుకోవడంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ సిద్దహస్తులని అన్నారు. వందే భారత్ రైలును ఇప్పటికే పది సార్లు ప్రారంభించడం మోదికే చెల్లుతుందని అన్నారు.
అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విషం కక్కడానికి ఏర్పాటు చేసిన రాజకీయ సభగా మార్చారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన బృహత్తర కార్యక్రమం అయిన మిషన్ భగీరథను రూ. 40 వేల కోట్ల వ్యయంతో చేపట్టి దేశ ప్రధాని మోది చేతుల మీదుగా కేవలం ఒక్కసారే ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. ఏ ప్రాజెక్ట్ అయిన ఒకే సారి ప్రారంభిస్తారని, సికింద్రబాద్ నుంచి తిరుపతికి ఇప్పటికే రైలు లేనట్టు దేశ ప్రధాని వచ్చి రైలును ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి మెడికల్ కళాశాలు కావాలని ఎన్ని సార్లు అడిగినా ఇవ్వని కేంద్రం అసలు తెలంగాణ నుంచి తమకు ప్రతిపాదనలే రాలేదని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కష్టాలతో ప్రజలు, మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై బిందెలతో ప్రదర్శనలు చేసేవారని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత నీటి కష్టాలు తగ్గాయని, నిరంతరం విద్యుత్ సరఫరా అందుతుందని అన్నారు. ఎంతో క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలు కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నారని అన్నారు. గత ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గంలో ఓడిపోతామనే పుకార్లు షికార్లు చేసిన కార్యకర్తలు తనకు అండగా ఉండి 40 వేల పైగా ఓట్లతో గెలిపించారని అన్నారు. నియోజకవర్గం పరిధిలో ప్రజలకు నిరంతరం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అనంతరం బాలానగర్‌కు చెందిన వంద మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీష్ అరోరా, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, డివిజన్ అధ్యక్షుడు కంచి భిక్షపతి, శాఖయ్య, అంబటి శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్ర చార్యా తదితరులు పాల్గొన్నారు.