మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధి చర్యలు చేపట్టాలి : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని, నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్రకార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు.

Update: 2023-05-12 16:46 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని, నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్రకార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం శామీర్పేట జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అంశాల పై మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్ళేలా నియోజకవర్గంలోని అన్నిశాఖల అధికారులు తమవిధులు మరింత ఉత్సాహంతో నిర్వహించాలని, ఈ విషయంలో ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని అన్నారు.

ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గం అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి దిశలో పయనిస్తోందని దీనికి తోడు మరింత అభివృద్ధి జరిగేలా అదే ఉత్సాహంతో అధికారులు తమ విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో అభివృద్ధి పనులకు సంబంధించి నిధులకు ఏమాత్రం కొరతలేదని చేపట్టాల్సిన పనులను సకాలంలో పూర్తిచేసేలా అవసరమైన ముందస్తు కార్యాచరణతో సాగాలని మంత్రి అధికారులకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గం అన్నిరంగాల్లో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ఆయా మున్సిపాలిటీల్లో జరుగుతున్న పనులపై ప్రత్యేకంగా ఆయా మేయర్లు మున్సిపల్ ఛైర్పర్సన్లు, కమిషనర్లు, తహశీల్దార్లతో సమీక్షించి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీలకు డబుల్ బెడ్రూమ్లు, రహదారులు, వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, డంప్యార్డులు, దోభీఘాట్లు, స్టేడియం , తదితర అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఈ విషయంలో అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం తరపున చేపట్టే ప్రతి కార్యక్రమం ఇక్కడ నుంచే ప్రారంభం కావడం అది కూడా విజయవంతం కావడంఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని దీనికి తన నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా మంత్రి నిధులు తీసుకువచ్చి ప్రజల అవసరాలను తీరుస్తున్నారని అందుకు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం సహకరిస్తుందని కలెక్టర్ అమోయ్ కుమార్ సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మేయర్లు, ఛైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ విన్నవించుకోగా వాటిని అప్పటికప్పుడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవో మల్లయ్య, ఆర్అండ్ బి అధికారి శ్రీనివాస్ మూర్తి, ఈఈపీఆర్ఓ రామ్మోహన్, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు, మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News