ఉవ్వెత్తున ...‘నూతన’ ఉత్సాహం

పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఎడాదికి స్వాగతం పలుకుతూ నగరవాసులు సంబురాలు చేసుకున్నారు.

Update: 2024-12-31 16:35 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఎడాదికి స్వాగతం పలుకుతూ నగరవాసులు సంబురాలు చేసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే వేడుకల్లో మునిగి తేలారు. 31 రాత్రి జోష్ తో హోటళ్లు, పబ్బులు, రిసార్ట్ లు,ఈవెంట్ కేంద్రాలు సందడిగా మారాయి. కాక్ టైల్ విందులు, డ్యాన్సులతో ఉత్సహం ఉరకలేసింది. కొత్త సంవత్సరం అడుగిడిన మరుక్షణంలో గ్రేటర్ హైదరాబాద్ లో ‘హ్యాపీ న్యూ ఇయర్’ శుభాకాంక్షలు చెప్పుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేకులు కట్ చేసి, పటాకాలు కాల్చి అనందం పంచుకోనున్నారు.

ఈవెంట్లకు రేడీ...

నయాసాల్ వేడుకల్లో ఈసారి కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పబ్బులు, క్లబ్ లు, రిసార్ట్, బార్ అండ్ రెస్టారెంట్లే కాకుండా గేటేట్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లు, కాలనీ సంక్షేమ సంఘాలలోనూ కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించారు. థర్టీ ఫస్ట్ నైట్ అంటే గతంలో స్నేహితులతో కలిసి జల్సా చేసేవారు. కానీ ఈ ఏడాది కుటుంబంతో కలిసి చిందులేసిందుకు రెడీ అయ్యారు. అయితే ఈవెంట్లకు గ్లామర్ లుక్ తెచ్చేందుకు సెలబ్రెటీలను ఆహ్వనించారు.

హాట్ ‘కేకులు’

న్యూ ఇయర్ వేడుకలతో బేకరీలు, స్వీట్ హౌస్ లు కళకళలాడాయి. నగరంలో రెట్టించిన ఉత్సాహంతో కొత్త సంవత్సర సంబరాలను చేసుకునేందుకు స్థానికులు ఏర్పాట్లు చేసుకున్నారు. కేకులు, పండ్లు, పూలబోకేలు, రంగులు, పూలు, షాపులు మంగళవారం మధ్యాహ్నం నుంచే బీజీగా కనిపిచాయి. కేకులు, స్వీట్లు కొనుగోళ్లతో సందడిగా మారాయి. కేకులకు కొందరు ప్రత్యేకంగా అర్డర్లు ఇచ్చి మరీ చేయించుకున్నారు. కొన్ని షాపుల నిర్వహకులు ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇచ్చారు.

స్పీడ్ కు బ్రేక్..

న్యూ ఇయర్ సందర్భంగా కుర్రకారు వేగానికి పోలీసులు బ్రేక్ వేశారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల నిబంధనలు పాటించాలని, ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనర్లు హెచ్చరించారు. మూడు కమిషనరేట్ల పరిధిలలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడిండ్ ర్యాష్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టిసారించారు. పబ్బులు, క్లబ్ లు, రిసార్టులు, న్యూ ఇయర్ ఈవెంట్స్ సెంటర్ల నిర్వాహకులు డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

     45 డెసిబుల్స్ కన్నా, తక్కువ సౌండ్ సిస్టం ఉండేలా చూసుకోవాలన్నారు. అశ్లీల నృత్యాలు నిర్వహించవద్దని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అదే విధంగా డ్రగ్స్ టెస్ట్ కిట్స్ లను అందుబాటులో ఉంచారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడినట్లు అనుమానం కలిగితే యూరిన్ శాంపిళ్లను తీసుకునేందుకు టీ న్యాబ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. మద్యం మత్తులో ఉన్నవారిని సురక్షితంగా గమ్యం చేర్చేందుకు ఈసారి చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ ఫోర్ వీలర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ అసోసియేషన్ తో కలిసి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


Similar News