సమస్యల వలయంలో గట్టు మైసమ్మ ఆలయం

దేవాదాయ శాఖ పర్యవేక్షణతో పట్టణ కేంద్రంలో గట్టు మైసమ్మ

Update: 2025-01-05 02:46 GMT

దిశ,ఘట్కేసర్: దేవాదాయ శాఖ పర్యవేక్షణతో పట్టణ కేంద్రంలో గట్టు మైసమ్మ దేవాలయ ప్రాంగణం చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, మందు సీసాలు కనిపిస్తున్నాయి. పారిశుధ్యం విషయంలో దేవాలయం ఈవో పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. సంవత్సరానికోసారి జరిగే జాతర కూడా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. దేవాదాయ శాఖ నుంచి రూపాయి ఖర్చు చేయకుండా జాతర ఎలా నిర్వహిస్తారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

19న జాతర..

ఘట్కేసర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట గత ఏడాది డిసెంబర్ 29న గట్టు మైసమ్మ జాతర నిర్వహణ కు ఏర్పాటు చేసిన సమావేశంలో దేవాదాయ శాఖ ఈవో భాగ్యలక్ష్మిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్థానికంగా వసూలు చేసిన డబ్బుతో జాతర నిర్వహిస్తారా..? అలాంటప్పుడు దేవదాయ శాఖ అధీనం లో ఉండేందుకు వీలులేదని మండిపడ్డారు. ఆరేళ్లుగా దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న గట్టు మైసమ్మ ఆలయాన్ని ఏమాత్రం అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. అయితే ఘట్కేసర్ మున్సిపాలిటీ పాలకవర్గం 25వ తేదీతో ముగుస్తుండటంతో ప్రజా ప్రతినిధులకు జనవరి 19న జాతర నిర్వహించడానికి తీర్మానం చేశారు. ఇప్పటి వరకు పారిశుధ్యం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మరుగుదొడ్ల పై వివాదం..అలంకారప్రాయంగా సీసీటీవీ కెమెరాలు

కిందటి సంవత్సరం గట్టు మైసమ్మ జాతర కోసం బయో టాయిలెట్ ను ఏర్పాటు చేశారు. ఆ టాయిలెట్ల నిర్వహణ విషయం గాలికి వదిలేసిన దేవాదాయ శాఖ, దేవాలయం పైకి వెళ్లే మెట్ల దారి పక్క నే ఓ మరుగుదొడ్డి నిర్మించడం వివాదాస్పదంగా మారింది. దేవాలయం పక్కనే మరుగుదొడ్డి ఎలా నిర్మిస్తారని దేవాలయ భూమి దాతలు ప్రశ్నిస్తున్నారు. దేవాలయం పక్కనే ఉన్న మరుగుదొడ్డి నిర్వహ ణ సరిగా లేక అక్కడే చెత్తాచెదారం వేయడంతో కంపు కొడుతోంది. ఇక బయో టాయిలెట్లకు తలుపు లేకుండా గాలికి వదిలేయడం గమనార్హం. రాత్రి సమయాల్లో దేవాలయ పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని పలువురు వాపోతున్నారు. ఇక్కడ రాకపోకలపై నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం గమనార్హం.

దేవాదాయ శాఖ ఆధీనం నుంచి విడిపించాలి..

ఏళ్లుగా ఘట్కేసర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజ లకు ఆరాధ్య దేవతగా కొలువుదీరిన గట్టు మైసమ్మ దేవాలయం స్థానిక రాజకీయ నాయకులు, వివిధ సంఘాల మధ్య ఉన్న గొడవల కారణంగా దేవదాయ శాఖ ఆధీనంలో కి వెళ్లి పోయి ఆరేళ్లకు పైబడింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఆనవాయితీగా నిర్వహించుకునే జాతర ను దేవాదాయ శాఖ ఈవో ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నా రు. అయితే, దేవదాయ శాఖ నుంచి జాతర నిర్వహణకు ఎలాంటి నిధులు జారీ కాకపోవడం వల్ల దేవాలయ అభివృద్ధి కుంటుపడుతోందని స్థానికులు చెబుతున్నారు. జాతర కు వచ్చి వెళ్లే భక్తులకు విడి గా దారులు లేకపోవడం వల్ల తొక్కిసలాట జరుగుతోందని, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వలాభం కోసం తప్ప దేవాలయం అభివృద్ధికి అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ స్పందిం చి అభివృద్ధికి నిధులు జారీ చేయాలని లేదంటే ఆలయాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.


Similar News